Bills pending with the governor: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన బిల్లులను రాష్ట్ర శాసన సభలో ఆమోదం లభించినప్పటికి గవర్నర్ మాత్రం వాటికి ఆమోదం తెలపకుండా పెండింగ్‌లోనే ఉంచుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్‌పై స్పందనకు సమయం కోరిన కేంద్రం.. కేంద్ర ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తితో విచారణను ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది.
ఇది వరకే ఈ కేసును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.శ్రీనరసింహ, జస్టిస్ జె.బి.పర్డీవాలాతో కూడిన ధర్మాసనం ఈనెల 22న విచారణ చేపట్టి.. కేంద్రానికి లిఖిత పూర్వక నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే..
గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లులు: గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మధ్య జరుగుతున్న విభేదాలు గురించి తెలిసిన విషయమే. ప్రభుత్వం శాసనసభలో ఆమోదం లభించిన బిల్లులను గవర్నర్ వద్దకు పంపిస్తే.. పెండింగ్‌లో ఉంచుతున్నారని అధికార పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో జరిగిన రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం 8 బిల్లులను తీసుకురాగా.. అందులో రెండు కొత్త బిల్లులు.. ఆరు చట్ట సవరణలకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి.
విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టేందుకు రాష్ట్రంలో ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేసేలా చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. సిద్దిపేట, ములుగు జిల్లాలో ఉన్న అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మారుస్తూ చట్టం రూపకల్పన చేసేందుకు మరో బిల్లు తీసుకొచ్చింది. మరికొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి లభించేలా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టాన్ని సవరణకు తీసుకొచ్చిన బిల్లులు ఉన్నాయి.
జీహెచ్ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ చేస్తూ మరో బిల్లు తీసుకొచ్చింది. వీటితో పాటు పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ చట్టం, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్టం, జీఎస్టీ చట్టాలను సవరిస్తూ బిల్లులను తీసుకొచ్చింది. ఈ బిల్లులు గత ఏడాది సెప్టెంబర్ 13న మొత్తం 8 బిల్లులు ఉభయసభల ఆమోదం లభించింది. అనంతరం గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపారు.
అయితే అందులో ఒక్క జీఎస్టీ చట్టసవరణ బిల్లు మాత్రమే ఆమోదం పొంది చట్టంగా మారింది. మిగిలిన ఏడు బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించలేదు. వీటితో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించుకున్న మరో 3 కొత్త బిల్లులను సైతం గవర్నర్ పెండింగ్‌లో పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.
ఇవీ చదవండి:
నేను కాంగ్రెస్‌లో చేరానని భావిస్తే రాజీనామా చేస్తున్నా.. : డీఎస్
వివేకా హత్యకేసు ఇంకా ఎంతకాలం విచారిస్తారు? :సుప్రీం
TSPSC లీకేజీలో 15కు చేరిన అరెస్ట్‌లు.. ప్రవీణ్ ఇంట్లో రూ.5 లక్షలు స్వాధీనం