ఐదు దశాబ్దాల తరువాత.. మెడికల్ కళాశాల విద్యార్థుల ఆత్మీయ కలయిక - కర్నూలు వార్తలు
Reunion of Old Students: వారందరూ కాకలు తిరిగిన సీనియర్ వైద్య నిపుణులు. 50 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఆనాటి మధుర స్మృతులు గుర్తు చేసుకున్నారు. 1972 -78లో కర్నూలు మెడికల్ కళాశాల్లో చదువుకున్న విద్యార్థులు.. అక్కడ పట్టభద్రులై.. డిసెంబర్ 16కి అర్ధ శతాబ్దమైన సందర్భంగా 'త్రిబుల్ ఆర్' పేరుతో ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసుకున్నారు. 'ప్రతిబింబించు, సంతోషించు, చైతన్యం నింపు' అనే నినాదంతో.. రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు.
Reunion of Old Students: కర్నూలు జిల్లాలో 1972 -78లో 'కర్నూలు మెడికల్ కళాశాల్లో' చదువుకున్న విద్యార్థులు ఐదు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కలుసుకున్నారు. ప్రస్తుతం దేశ, విదేశాల్లో ప్రముఖ వైద్యులుగా పేరుగడించిన వారు.. గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. వీరిలో కొందరు వైద్య కళాశాలలకు ప్రిన్సిపల్‌గా ఉన్నారు.
తమ వృత్తికి పునాదులు వేసి.. వైద్యరంగంలో అడుగులు నేర్పిన తమ ప్రధానాచార్యుడు డాక్టర్ హరినాథ్‌ని ఈ సందర్భంగా కలుసుకోవడం నూతన ఉత్తేజాన్ని నింపిందని ఆనందం వ్యక్తంచేశారు. జ్యోతి ప్రజ్వలనం, జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారిలో కొందరు పాటలు పాడి అలరించారు. విద్యార్థుల ఆహ్వానంతో 96 ఏళ్లు ఉన్నా, నూతనుత్తేజంతో కార్యక్రమానికి హాజరైన అప్పటి ప్రధానాచార్యుడు డాక్టర్ హరినాథ్.. పవిత్ర తుంగభద్ర తీరాన కొలువుదీరిన కర్నూలు వైద్య కళాశాల.. ఒక దేవాలయం లాంటిదని గుర్తు చేశారు.
5 దశాబ్ధాల తర్వాత కలిసిన వారంతా మూడ్రోజుపాటు ఫిల్మ్‌సిటీలో అనందంగా గడపాలని నిశ్చయించుకున్నారు. రెండోరోజు ఎన్ఆర్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నట్లు తెలిపారు. అనంతరం ఫిల్మ్‌సిటీ మెుత్తం కుటుంబ సమేతంగా తిలకించనున్నారు.
ఇవీ చదవండి: