భారత గ్రామీణ ఆర్థికవ్యవస్థకు కీలకమైన వ్యవసాయరంగానికి యువత క్రమంగా దూరమవుతున్నారు. సాగును చిన్నచూపుగా భావించి పట్నం వైపు పరుగులు పెడుతున్నారు. కరోనా తెచ్చిన మార్పులతో సాగు రంగ ముఖచిత్రం మారుతోంది. వ్యవసాయమే దిక్కు అనే పరిస్థితులు రాబోతున్నాయని సాగు పరిశోధన సంస్థలు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా వేళ విద్యాసంస్థలు తెరుచుకోకపోవడం వల్ల హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని చిన్నారులు ఉత్సాహంగా పొలం బాట పడుతున్నారు. ఇంటి పెద్దలు, కూలీలతో కలిసి ఆడుతూ పాడుతూ వరినాట్లు వేస్తున్నారు. పొలం పనులు నేర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంటున్నారు.
పొలం'బడి'
నీటి లభ్యత ఉన్నచోట వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. కూలీల కొరత వేధిస్తున్న తరుణంలో పొలాల్లో స్వయంగా పనులుచేస్తూ తల్లితండ్రులకు ఆసరాగా ఉంటున్నారు. పొలం పనుల్లో మెళకవలు, సాధక, బాధకాలు తెలుసుకుంటున్నారు. దేశానికి అన్నంపెట్టే అన్నదాతకు సాయపడాలన్నదే తమ లక్ష్యమని చెబుతున్నారు.
వ్యవసాయంతోనే భవిష్యత్తు
కరోనాతో పలువురు ప్రైవేటు ఉద్యోగులు సొంతూర్లకు వెళ్లి సాగుబాట పడుతున్నారు. వారసత్వంగా వచ్చిన సాగును ప్రవృత్తిగా ఎంచుకోడానికి సిద్ధమవుతున్నారు. భవిష్యత్తులో వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సంకేతాలిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. యువత సేద్యం చేస్తేనే సాగుకు పూర్వవైభవం వస్తుందంటున్నారు.
ఇది దండగ కాదు... పండుగ
వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించాలంటే మరింతమంది యవకులు సాగురంగం వైపు మొగ్గుచూపి అద్భుతాలు సృష్టించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.