హైదరాబాద్ నాగోల్ సాయినగర్ కాలనీలోని నాగార్జున ఉన్నత పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న వివిక అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఉదయం ఏడు గంటల 40 నిమిషాల సమయంలో పాఠశాలకు వచ్చిన వివిక పది నిమిషాల్లోనే భవనంపై నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైన స్థితిలో కనిపించింది. గమనించిన స్థానికులు వెంటనే పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
విద్యార్థి సంఘాల ఆందోళన
పాఠశాల భవనం నుంచి జారిపడి కింద పడటం వల్లే వివిక మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం మాత్రం వివిక కిందికి దూకిందని చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఘటనను నిరసిస్తూ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆస్పత్రి వద్ద విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాప మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు.
తల్లిదండ్రులు, పోలీసులకు మధ్య వాగ్వాదం
మొదట పోలీసులు మృతదేహాన్ని కామినేని నుంచి ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. దీనిని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని పాఠశాల వద్ద ఉంచి ఆందోళన చేస్తామని చెప్పి అక్కడే బైఠాయించారు. పోస్టుమార్టం నిర్వహణకు సంతకం చేసేందుకు కూడా నిరాకరించారు. మృతదేహాన్ని మరోసారి ఉస్మానియా ఆస్పత్రి నుంచి కామినేని ఆసుపత్రికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని పాఠశాల తరలించేందుకు కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి పోలీసులు నచ్చచెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.
పాఠశాల సీజ్
విద్యార్థి మృతి చెందిన ఘటనతో నాగార్జున ఉన్నత పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తానని ఉప్పల్ ఎంఈవో మదనాచారి తెలిపారు. పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మిగతా పాఠశాలల్లో చేర్పించేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పాఠశాల యాజమాన్యంతో పాటు తోటి విద్యార్థుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
ఇవీ చూడండి: పాఠశాల భవనం నుంచి పడి విద్యార్థిని మృతి