Current Status of Hyderabad Roads : నగరంలోని ఏ రోడ్డు చూసినా ఏముంది గర్వకారణం. ఒక్కో రోడ్డుపై లెక్కపెట్టలేనంతగా గుంతలు దర్శనమిస్తున్నాయి. వర్షం వస్తే ఎక్కడ గుంత ఉందో.. ఎక్కడ రోడ్డు ఉందో తెసుకోవడం వాహనదారులకు ఓ పజిల్‌గా మారిపోయింది. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. భారీ వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ ప్రాంతంలో అనేక రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్ల పునరుద్ధరణ కోసం 255.66 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
చేతులెత్తిసిన ప్రైవేట్ సంస్థలు.. నగర వ్యాప్తంగా 9వేల103 కిలోమీటర్ల రహదారులు విస్తరించి ఉన్నాయి. ఇందులో 811 కిలోమీటర్ల ప్రధాన రహదారులను ఐదేళ్లు గుంతల్లేకుండా చూసుకోవాలని జీహెచ్ఎంసీ.. ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. అందుకు 1,850 కోట్ల రూపాయలు చెల్లించాలని ఒప్పందం ఉంది. ఒప్పందం చేసుకున్న రెండేళ్లు ఆయా రోడ్లను గుత్తేదారులు మెరుగ్గా నిర్వహించినా.. ఏడాదిగా చేతులెత్తేశారు. ఆ సంస్థల నిర్లక్ష్యాన్ని ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు సైతం పట్టించుకోక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు చెబుతున్నారు.
Current status of Hyderabad roads : ప్రైవేట్ నిర్వహణకు ఇచ్చిన రోడ్లు మినహా మిగిలిన 8వేల 500ల కిలోమీటర్ల రోడ్లు జీహెచ్ఎంసీ నిర్వహిస్తుంది. వాటిని మెరుగ్గా ఉంచేందుకు ఏటా 800 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ తారు రోడ్ల నాణ్యత ఏమాత్రం మెరుగవ్వడంలేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు. రోడ్ల నిర్మాణం, రిపేర్ల సమయంలో అధికారులు నాణ్యతపై దృష్టి పెట్టడం లేదు. నాణ్యత నియంత్రణ విభాగం అధికారులు ఉన్నా పట్టించుకోకపోవడంతోనే సమస్య ఏర్పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీటీ రోడ్లు, సీసీ రోడ్లు వేసిన కొన్నాళ్లకే పాడైపోతున్నాయి.
Damaged Hyderabad Roads : రోడ్ల నిర్వహణ, మరమ్మతులపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ముఖ్యంగా సంస్థల మధ్య నెలకొన్న సమన్వయ లోపం కారణంగానే చాలా చోట్ల ఈ పరిస్థితి తలెత్తుందని నిపుణులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హెచ్ఎండీడబ్య్లూఎస్తో పాటు వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కన్పిస్తుంది. ఓ వైపు నాలాల కోసం జీహెచ్ఎంసీ గుంతలు తవ్వి వదిలేయగా, మరోవైపు మురుగునీటి పైపులైన్ల కోసం జలమండలి చేపట్టిన తవ్వకాలతో దారులన్నీ దుర్భరంగా మారాయి.
నీరుగారిపోతున్న హామీలు.. శివారు కార్పొరేషన్లు , మున్సిపాలిటీల్లోనూ రహదారుల నిర్వహణ అధ్వాన్నంగా మారింది. నిజాంపేట, జవహార్‌నగర్, బండ్లగూడ జాగీర్, పీర్జాదీగూడ, బోడుప్పల్, బడంగ్ పేట, మీర్‌పేట కార్పొరేషన్లు, నార్సింగి, మణికొండ, పెద్ద అంబర్‌పేట, జల్‌పల్లి మున్సిపాలిటీల పరిస్థితి దారుణంగా మారాయి. అక్కడ రోడ్ల నిర్వహణ కొన్నేళ్లుగా జరగడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 100, 200కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ది చేస్తామన్న సర్కారు హామీలు అమలుకాకపోవడం, ఆయా స్థానిక సంస్థలను నిధుల సమస్య వేధిస్తుండటమే ఇందుకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇష్టానుసారంగా తవ్వకాలు.. సీఆర్ఎంపీ రోడ్లు మినహా మిగిలిన రోడ్లపై జీహెచ్ఎంసీ గడిచిన మూడేళ్లలో 2వేల కోట్ల నిధులను ఖర్చుపెట్టింది. రోడ్లు వేసిన తర్వాత వాటిని పర్యవేక్షించడంలేదు. రోడ్లు వేసిన కొద్దిరోజులకే జలమండలి అధికారులు లేదా ప్రైవేట్ టెలికాం సంస్థ అధికారులు లేదా ఇతర వ్యక్తులు.. ఇలా ఎవరో ఒకరు రోడ్లను తవ్వడం పరిపాటైపోయింది. దీంతో వర్షాకాలం వచ్చే సరికి నగరంలో 50% కాలనీ రోడ్లు గుంతలుగా దర్శనమిస్తున్నాయి.
విశ్వనగరఖ్యాతికి రోడ్లగండం.. ప్రధానంగా సిటీ ప్రధాన రహదారుల్లో నిత్యం కొన్ని లక్షల మంది ప్రయాణిస్తుంటారు. కనీసం ఇవైనా బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం చేపట్టే తూతూ మంత్ర చర్యలతోని లాభం లేదని అంటున్నారు. రోడ్లు సరిగ్గా లేక వాహనదారులు వాహనాల రిపేర్‌కే ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇది కాదన్నట్టు బైక్‌లు స్కిడ్ అయి పడిపోవడం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. విశ్వనగరంగా తీర్చిదిద్దాల్సిన హైదరాబాద్‌కు రోడ్ల గండం వెక్కిరిస్తుంది. మరి, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Roads Damaged in Jagtial District : భారీ వర్షాలు.. తెగిపోయిన రోడ్లు, వంతెనలు.. నిలిచిపోయిన రాకపోకలు