ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం పూర్తిగా తెరాస కార్యకర్తలకు ఇస్తున్నారని రాష్ట్ర తెదేపా ప్రతినిధి సంతోశ్ మండిపడ్డారు. వరద బాధితులకు ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ అల్వాల్‌లోని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున వరద బాధితులతో పాటు తెలంగాణ తెదేపా నాయకులు ధర్నా నిర్వహించారు.
ఇటీవల మల్కాజిగిరిలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేటీఆర్ అల్వాల్‌లో కూడా పర్యటిస్తే ఇక్కడ పరిస్థితి తెలిసేదని సంతోశ్ పేర్కొన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజల ఇళ్లలోకి వరదనీరు చేరడం వల్ల వారు పూర్తిగా నష్టపోయారని.. వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వరదల వల్ల నష్టపోయిన బాధితులకు కాకుండా తెరాస కార్యకర్తలకు డబ్బులు పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
వరదల మూలంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రత్యేకంగా గుర్తించి వారికి ఆర్థిక సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్థిక సహాయం చేసే క్రమంలో కేవలం అధికారులు మాత్రమే ఉండాలన్నారు. తెరాస నాయకులు, కార్యకర్తల మూలంగా అసలైన వరద బాధితులకు లబ్ధి చేకూరకుండా పక్కదారి పడుతున్నట్లు సంతోశ్ ఆరోపించారు.
ఇదీ చదవండి: అర్హులకు ఆర్థిక సాయం అందించాలని వరద బాధితుల ధర్నా