Jagdish Reddy criticized Bandi Sanjay: బండి సంజయ్‌కి ధైర్యముంటే టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీపై ఆధారాలు ఇవ్వాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. సిట్ ముందు హాజరయ్యేందుకు సంజయ్ ఎందుకు భయపడుతున్నారని మంత్రి ప్రశ్నించారు. ఎన్ని దీక్షలు చేసినా బీజేపీ నేతలు రాష్ట్రంలో శాశ్వత నిరుద్యోగులుగానే మిగిలిపోతారని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రశ్నపత్రం లీకేజీని బయట పెట్టిందే తమ ప్రభుత్వమని మంత్రి తెలిపారు. దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవన్నారు.
ఎంత మంది రాజీనామా చేశారు: స్కాంలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతాయని విమర్శించారు. తెలంగాణలో అమలయ్యేవి స్కీములు మాత్రమేనన్నారు. ప్రశ్నపత్రం లీకేజీతో కేటీఆర్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. కేవలం ఈర్ష్యతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు లీకయినప్పుడు ఎంత మంది రాజీనామా చేశారని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. దోషులను కాపాడేందుకు, నియామక ప్రక్రియను జాప్యం చేసేందుకే బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అందుకే ఈ కేసు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారని ఆయన అన్నారు.
రాహుల్‌పై అనర్హత వేటు.. బీజేపీ తప్పుడు ఆలోచన: బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలన్నీ కలిపినా తెలంగాణలో ఇచ్చినన్నీ ఉద్యోగాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. కుంభకోణాలు, ఏజెన్సీల దుర్వినియోగం, బూతులు మాట్లాడటంలో బీజేపీతో తాము పోటీ పడ లేమన్నారు. ఓయూ ఘటనల్లో దొంగలను గుర్తిస్తామన్నారు. రాహుల్‌పై అనర్హత వేటు.. బీజేపీ తప్పుడు ఆలోచన ఫలితమేనని.. ఏజెన్సీలనే కాకుండా పార్లమెంట్ సెక్రటేరియట్‌ను ఆ పార్టీ దుర్వినియోగం చేసిందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. రాహుల్‌పై అనర్హత వేటు పడినా.. గట్టిగా పోరాడలేని నిస్సహాయ, అచేతన స్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు.
"బీజేపీ నాయకులు రాష్ట్రంలో నిరుద్యోగులను వాడుకోవాలని చూస్తున్నారే తప్పా.. వారు భవిష్యత్తు కోసం ఆలోచించట్లేదు. అలా ఉంటే వారు చేయాల్సిన డిమాండ్ వెంటనే మరో నోటిఫికేషన్ ఇవ్వండి అని చేయాలి. ఓ నాయకుడు గవర్నర్ దగ్గరికి వెళ్లి మీరు రద్దు చేయండి.. మీకు ఆ అధికారం ఉందని అంటారు. సీబీఐకి కేసు అప్పగించమంటున్నారు ఆ సంస్థ 10సంవత్సర కాలంలో కేసులు పూర్తి చేసిన దాఖలాలు లేవు. వారి ఆలోచన ఏంటంటే నిరుద్యోగులు అలానే ఉండాలి. జీవితాలు నాశనం చేసుకోవాలి. ఇది బీజేపీ నాయకుల ఆలోచన."- జగదీష్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
ఇవీ చదవండి: