కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా కొనియాడారు. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్తో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఇక్కడి గిరిజనుల కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. లాక్డౌన్ సందర్భంగా గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యవతి కేంద్ర మంత్రికి వివరించారు.
లాక్డౌన్ నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం, అంగన్వాడీ ద్వారా అందించే పాలు, గుడ్లు, నిత్యావసర వస్తువులు ఎలాంటి అంతరాయం లేకుండా అందిస్తున్నామని కేంద్రమంత్రికి వివరించారు. వైద్య సేవలకు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐటీడీఏల ద్వారా, సంబంధిత జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ముఖ్యంగా బాలింతలు, గర్భిణీలు, చిన్న పిల్లలకు వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు రాలేదని, ఇకపై కూడా రాకుండా చూసుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు సత్యవతి రాఠోడ్ కేంద్రమంత్రికి వివరించారు.
ఇదీ చూడండి: భారత్కు ఏడీబీ 220 కోట్ల డాలర్ల సాయం