జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. షెడ్యూల్ విడుదల, బ్యాలెట్ ప్రతుల ముద్రణ, తేదీల ఖరారుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. భేటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, నవీన్ మిట్టల్, తేజ్ దీప్ కౌర్ హాజరయ్యారు. స్థానిక పోరులో ఎన్నికల నిర్వహణ, వాటికోసం కావాల్సిన సిబ్బంది, పోలింగ్ బూత్ల ఏర్పాటు తదితర అంశాలపై చర్చిస్తున్నారు.
32,007 పోలింగ్ కేంద్రాలు అవసరం
రాష్ట్రంలోని 32 జడ్పీటీసీలు, 535 ఎంపీపీలు, 5,857 ఎంపీటీసీలలో ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికోసం 32,007 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. వీటికోసం 55వేల భద్రతా సిబ్బంది అవసరమవుతారని అంచనా వేస్తున్నారు. సుమారుగా కోటి 60 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
20 లోపు ఏర్పాట్లు పూర్తి..
స్థానిక సంస్థల ఎన్నికలకు ఈనెల 20 లోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉందన్న ఆయన ఈనెల 18, 20 తేదీల మధ్య నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది నియామకం పూర్తైందని అన్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణే కాస్త క్లిష్టతరమని... అభ్యర్థుల తుది జాబితా పూర్తయిన తరువాత మూడు రోజుల్లో ముద్రిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అందరికీ ఉంటుందని తెలిపారు.
ఇవీ చూడండి: శబరిమలపై ఆర్డినెన్సు ఎందుకు తీసుకురారు?'