రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేసే పరిస్థితులు లేనందున.. విద్యార్థుల ఇళ్లకే పౌష్టికాహారం పంపించాలని విద్యా శాఖకు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సిఫార్సు చేసింది. ప్రైవేటు విద్యా సంస్థల పనితీరు, రుసుములపై నియంత్రణ కోసం మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలని సూచించింది. కొవిడ్ ప్రభావంతో విద్యార్థుల చదువులకు ఆంటంకం కలగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలను సూచిస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు కమిషన్ ఛైర్మన్ జె. శ్రీనివాసరావు లేఖ రాశారు.
నాణ్యమైన బోధన..
కరోనా కారణంగా పాఠశాలల మూసివేతతో బాల్య వివాహాలు, బాల కార్మికులు పెరిగే ప్రమాదం ఉందని కమిషన్ హెచ్చరించింది. మూడు నుంచి పదో తరగతి వరకు ఆన్లైన్ బోధనకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడాన్ని బాలల హక్కుల కమిషన్ అభినందించింది. విద్యార్థులకు నాణ్యమైన, ప్రత్యామ్నాయ బోధన అందించడం సవాల్‌గా మారిందని.. ఇంటర్నెట్ సదుపాయం లేని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో టీవీ మాధ్యమాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్ర బాల స్వాస్థ కార్యక్రమంపై దృష్టి పెట్టి పరీక్షలు జరిపించాలని శ్రీనివాసరావు కోరారు.
ఇదీ చదవండి: Air Force : 'దేశ భద్రతలో వాయుసేనది కీలకపాత్ర'