నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. నాన్న ముకుందం హెచ్‌ఎంటీ ఉద్యోగి. నాకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు ఆయన చనిపోయారు. నాకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. ‘పిల్లల్ని ఇంకేం చదివిస్తారులే.. స్కూల్ మాన్పించేయండి’ అని కొందరు అమ్మ(కళావతి)తో చెప్పారు. ఆ మాటల్ని పట్టించుకోకుండా ఆమె మమ్మల్ని చదివించింది. నాన్న చనిపోయేనాటికి అమ్మ పదో తరగతి కూడా పూర్తి చేయకపోవడంతో ఉద్యోగం వెంటనే రాలేదు. దాంతో ఇల్లుగడవడానికి చిన్నగా చీరల వ్యాపారం చేసేది. మమ్మల్ని చదివిస్తూనే తానూ చదువుకుంది. అమ్మ కష్టాన్ని అర్థం చేసుకుని మేమూ బాగా చదువుకునేవాళ్లం. నాకు మంచి మార్కులు రావడంతో స్కూలు ఫీజు రాయితీ ఇచ్చారు. ముందు నుంచీ నాకు లెక్కలంటే ప్రత్యేక ఆసక్తి. ఎనిమిదో తరగతికి వచ్చేసరికి కుటుంబ పరిస్థితులు అర్థమయ్యాయి. దాంతో నా తోటి విద్యార్థులకీ, చిన్న క్లాసుల వాళ్లకీ చెల్లితో కలిసి ట్యూషన్లు చెప్పడం ప్రారంభించా. ఆ ఫీజులతో మేం పుస్తకాలు, యూనిఫామ్ కొనుక్కునేవాళ్లం. దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేశాక అమ్మకి ఉద్యోగం రావడంతో ఆర్థిక ఇబ్బందులు తగ్గాయి.

క్రికెట్‌తో.. లెక్కలు!
డిగ్రీలో మ్యాథ్స్, అప్లయిడ్ మ్యాథ్స్, స్టాటస్టిక్స్ ఆప్షనల్స్‌గా తీసుకుని చదివా. ‘ఉస్మానియా’ పరిధిలో రెండో ర్యాంకు సాధించా. తర్వాత బీఈడీ, ఎమ్మెస్సీ చేశా. డీఎస్సీద్వారా 1996లో ఎస్జీటీగా, 1999లో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యా. మొదట్నుంచీ ఉద్యోగం హైదరాబాద్‌లోనే. ప్రస్తుతం మలక్‌పేటలోని నెహ్రూ మెమోరియల్ హైస్కూల్లో పనిచేస్తున్నా. 1997లో గార్లపాటి వేణుతో వివాహమైంది. తరువాతా చదువుని కొనసాగించా. మారుతున్న పరిస్థితుల్లో కంప్యూటర్ నైపుణ్యాలు లేకపోతే కష్టమని రెండేళ్లపాటు వివిధ కంప్యూటర్ కోర్సులు చేశా. 2001 నుంచే క్లిష్టమైన అంశాల్ని విద్యార్థులకు వీడియోలతో వివరించేదాన్ని. ప్రస్తుతం మా స్కూల్లో ఆన్‌లైన్ విద్యకు ఉపయోగపడే అనేక పరికరాలున్నాయి. ప్రభుత్వం, దాతలు అందించిన పూర్తిస్థాయిలో వాటిని వినియోగిస్తాం. 8, 9, 10 తరగతులకు గణితం బోధిస్తా. ఎనిమిదిలో ఉన్నప్పుడే విద్యార్థుల స్థాయిని అర్థం చేసుకుని వారికి తెలియకుండానే బృందాలుగా విభజిస్తా. ఏడాదిలో బలమైన పునాది వేసి తొమ్మిదిలోకి వచ్చేసరికి లెక్కలపైన భయం పోయేలా చేస్తా. పదో తరగతికి వచ్చేసరికి వారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. నిజజీవిత ఉదాహరణలతో గణితాన్ని అనుసంధానించి బోధిస్తా. క్రికెట్‌నే తీసుకుంటే రన్‌రేట్, బ్యాటింగ్ సగటు, బౌలింగ్ సగటు వంటి అంశాల్ని గణితంతో అనుసంధానించి చెబుతా. అలాచేస్తేనే పిల్లల్లో ఆసక్తి, శ్రద్ధ పెరుగుతాయి. నా విద్యార్థులు వరుసగా నాలుగేళ్లు గణితంలో వందశాతం ఉత్తీర్ణత సాధించారు.
అమెరికాలో శిక్షణ...
2015లో ‘యునైటెడ్ స్టేట్స్- ఇండియన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్’ అమెరికా బోధన పద్ధతులపై శిక్షణ కోసం జాతీయస్థాయిలో ఏడుగురు టీచర్లని ఎంపికచేసింది. అందులో నేనూ ఉన్నా. ఆరు వారాలపాటు ‘యూనివర్సిటీ ఆఫ్ నెవ్యాడా’లో అధ్యయనం చేశా. డిజిటల్ పరికరాలతో గణితం ఎలా బోధించాలో తెలుసుకుని, ఇక్కడికి వచ్చాక వాటిని అనుసరిస్తున్నా. ‘ఇంటర్నేషనల్ రీసెర్చ్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్’ ద్వారా అమెరికాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ఇక్కడకు వచ్చినపుడు మా స్కూల్లో ఆతిథ్యం ఇచ్చాం. అలాగే అమెరికా, ఇంగ్లాండ్, రష్యా... దేశాల ఉపాధ్యాయులు మా విద్యార్థులకు స్కైప్ ద్వారా పాఠాలు బోధించే ఏర్పాట్లు చేశా. దీనివల్ల విద్యార్థులు అక్కడి పరిస్థితుల్ని తెలుసుకోగలుగుతున్నారు. ఈ విషయంలో వారి తల్లిదండ్రులూ సంతోషిస్తున్నారు. దీంతో మా పాఠశాలలో ప్రవేశాలూ పెరిగాయి. విద్యార్థులకు నేనిచ్చే సలహా ఒకటే.. గణితం పరంగా ఎలాంటి సందేహం ఉన్నా వెళ్లి టీచర్లని అడగండి. ఆరోజే మీ సందేహం తీర్చుకోండి. అలాచేస్తే క్రమంగా మీకు గణితంపైన ఆసక్తి పెరుగుతుంది!
ఇవీచూడండి: మృత్యువు ముంచుకొస్తున్నా... సడలని సంకల్పం