హైదరాబాద్ రాజధానిలో కరోనా పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల దందా ఆగడం లేదు. సర్కార్ ఎన్ని హెచ్చరికలు చేసినా కొన్ని ఆస్పత్రుల దోపిడీ ఆగడం లేదు. ఇటీవల రెండు ఆస్పత్రుల్లో కరోనా వైద్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్.. కొన్ని పెద్ద ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాలుగైదు రోజులు జాగ్రత్తగా ఉన్న కొన్ని ఆస్పత్రుల తీరు తర్వాత షరా మామూలే. రోగి నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం మరోసారి కొరడా ఝళిపిస్తేనే ఫలితం ఉంటుంది. జీహెచ్‌ఎంసీ లెక్కల ప్రకారం ఏడాది కిందటి వరకు రాజధానిలో 2400 ఆస్పత్రులుండేవి. వివిధ కారణాలతో దాదాపు 500 చిన్నచిన్న ఆస్పత్రులు మూతపడ్డాయి. మిగిలినవి ప్రభుత్వ అనుమతి లేకుండా అనధికారిక చికిత్సలు అందిస్తున్నాయి. చాలామంది ఆరోగ్యం విషమించాక పెద్ద ఆస్పత్రుల్లో పడకలు దొరక్క తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చిన్న ఆస్పత్రుల్లో చేరుతున్నారు. రూ.లక్ష-రూ.2 లక్షల డిపాజిట్ కట్టించుకుని రెండుమూడు రోజులపాటు వైద్యం చేస్తున్నట్లు రోగి బంధువులను నమ్మిస్తున్నాయి. ఆ తరువాత రోగి చనిపోయినట్లు ప్రకటించి డిపాజిట్ పోను మరో రూ.3 లక్షల బిల్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆర్థికంగా ఉన్న వారైతే భరించగలరు. పేదలైతే ఆందోళనకు దిగితే కొంత మొత్తం తీసుకొని మృతదేహాన్ని ఇస్తున్నాయి. రెండు రోజుల కిందట ఎల్బీనగర్‌కు చెందిన రోగి విషయంలో ఇదే జరిగింది.
బిల్లు ఇవ్వరు.. బీమా ఆమోదించరు..:
కొన్ని పెద్ద ఆస్పత్రులు మరీనూ.. బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రి రోగికి రూ.18 లక్షల బిల్లు వేసింది. బిల్లులు ఇస్తే బీమా కంపెనీకి పంపుతానని రోగి అడిగితే రూ.50 వేలకే అధికారిక బిల్లులు ఇస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు చాలా ఆస్పత్రులు నగదే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.
- బీమా ఉన్నా.. కొన్ని ఆస్పత్రులు చికిత్సలకు నిరాకరిస్తున్నాయి.
- అధికారికంగా నగరంలో మొత్తం ఆస్పత్రులు 1900
- మొత్తం కరోనా పడకలు 2500
- రోగులతో నిండిన పడకలు 2000
- ఆస్పత్రుల అనుబంధ కేంద్రాల్లో దాదాపు 950 మందికి చికిత్స