‘నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అన్న మహాకవి శ్రీశ్రీ మాట... చారిత్రక అనుభవ సారం. ఎన్నో దేశాలు పరాయి పాలకుల కబంధ హస్తాల్లో నలిగి... వేలాది మంది యోధుల పోరాట ఫలితంగా దాస్య శృంఖలాలు తెంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నవే. మన దేశమూ వాటిలో ఒకటి. ఏడు దశాబ్దాల కిందట భరతమాతను బానిస సంకెళ్ల నుంచి విముక్తం చేసిన వీరులెందరో..
మానవజాతి పుట్టుక నుంచీ ఎన్నో వ్యాధులూ.. బాధలూ... ఒకప్పుడు కలరా, ప్లేగు.. ఇప్పుడు.. ప్రపంచ యవనికపై కనిపించని కాలసర్పంలా బుసలు కొడుతున్న కరోనా. ఈ మహమ్మారి కోరల్లో చిక్కి మన దేశం కూడా విలవిలలాడుతోంది. మనోధైర్యమే మందుగా ప్రతి ఒక్కరూ ఈ రక్కసితో పోరాడుతున్నారు. కొవిడ్ బాధితుల రక్షణకు, వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి ముందువరుసలో నిలిచి నిరంతర పోరాటం చేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ఎందరో యోధులు.. అలనాటి స్వాతంత్య్ర సంగ్రామంలో అలుపెరగని పోరు సలిపిన ధీరులతో.. నేడు కరోనా రక్కసిని నిలువరించేందుకు శ్రమిస్తున్న వీరులను పోల్చడం అతిశయోక్తి కాదేమో. ‘పుట్టుక నీది... చావు నీది... బతుకంతా దేశానిది’ అన్న కాళోజీ మాటల స్ఫూర్తి వారి సేవా తత్పరతకు నిదర్శనం.
ముందు నిలిచిన ‘గాంధీ’
స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్మాగాంధీ భరతజాతిని ముందుండి నడిపిస్తే.. రాష్ట్రంలో కొవిడ్‌పై పోరులో ముందు నిలిచింది గాంధీ ఆసుపత్రి. మార్చిలో తొలి కేసు నమోదైనప్పటి నుంచీ కొవిడ్ చికిత్సలకు ప్రత్యేక ఆసుపత్రిగా ఇది ఎందరికో ప్రాణభిక్ష పెట్టింది. ఇప్పటి వరకూ ఇక్కడి నుంచి 10 వేల మందికి పైగా ఆరోగ్యవంతులై ఇళ్లకు వెళ్లారు. ఈ ఆసుపత్రిలో దాదాపు 200 మంది వైద్యులు, 500 మంది నర్సులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారిలో దాదాపు 30 మంది వైరస్ సోకినా, కోలుకుని మళ్లీ విధుల్లోకి చేరారు.
ఐదు నెలలుగా అలుపెరగక..
సంక్లిష్ట పరిస్థితుల్లోనూ గాంధీ ఆసుపత్రి సిబ్బందిని ముందుండి నడిపిస్తున్నారు సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు. గాంధీ ఆసుపత్రిని కొవిడ్ చికిత్సకు ప్రత్యేకించడంతో రాజారావు బాధ్యతలు రెట్టింపయ్యాయి. దీంతో సుమారు ఐదు నెలలుగా ఆయన ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు. ఆయన ఉదయం 9 గంటలకు విధులకు రాగానే, సుమారు గంట సేపు పరిపాలనాంశాలు పరిశీలిస్తారు. 10 గంటలకు పీపీఈ కిట్ ధరించి కొవిడ్ సేవల్లోకి అడుగుపెడతారు. ఆసుపత్రిలోని 8 అంతస్తుల్లో 8 అత్యవసర సేవల విభాగాలున్నాయి. ముందుగా అత్యవసర వార్డుల్లోని బాధితులను పరిశీలిస్తారు. రోగి చేతులు పట్టుకుని, పలకరించి ధైర్యం చెబుతుంటారు. ఐసీయూల్లో దాదాపు 500 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతుండగా, వారందరి పడకల వద్దకు డాక్టర్ రాజారావే స్వయంగా వెళ్తుంటారు. ఇతర వైద్యులు, నర్సులకు ఇది మార్గదర్శకమవుతోంది. భోజనానంతరం సాయంత్రం 4 గంటల వరకూ పరిపాలనాంశాలపై దృష్టి. మళ్లీ పీపీఈ కిట్ ధరించి రాత్రి 7 గంటల వరకూ సాధారణ వార్డుల్లోని రోగులను పరిశీలిస్తారు. పీపీఈ కిట్ ధరిస్తే, గాలి ఆడక, అరగంట ఉండడమే చాలా కష్టం. అలాంటిది రోజూ ఆరు గంటల పాటు వాటిని ధరించే రోగులను పరిశీలిస్తారు. జనరల్ మెడిసిన్ విభాగాధిపతి కూడా కావడంతో.. చికిత్సలోనూ రాజారావుది కీలక పాత్రే. ‘కొవిడ్ కారణంగా గత అయిదు నెలలుగా ఇంట్లోనూ విడి గదిలోనే ఉంటున్నా. చాలా మంది రోగులు నాతో సెల్ఫీ దిగుతుంటారు. కోలుకొని ఇళ్లకెళ్తుంటే వారి కళ్లలో కనిపించే ఆనందం మాకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది’ అంటూ సంతృప్తి వ్యక్తం చేశారు డాక్టర్ రాజారావు. ఇక్కడ పనిచేసే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఎంతో అంకితభావంతో సేవలు అందిస్తున్నారని తెలిపారు.
క్షేత్రస్థాయి సిబ్బందివి అమోఘ సేవలు
కరోనా నియంత్రణలో వైద్యులతో పాటు ఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయి సిబ్బందిదీ అంతే కీలక పాత్ర. ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించేటప్పుడు ఎందరో కొవిడ్ బాధితులను తెలియకుండానే కలవాల్సి వస్తోంది. ఇది ప్రమాదకరమని తెలిసినా వైద్యసిబ్బంది ధైర్యంగా సేవలందిస్తున్నారు. ఆదివారం, పండుగ కూడా లేదు. అన్ని రోజులూ పనిదినాలే. ఇంటింటినీ జల్లెడ పట్టారు. ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 200 మంది సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో దాదాపు 150 మంది ఇప్పటికే విధుల్లోకి చేరారు. ఇది యుద్ధం లాంటి సమయం. అనారోగ్యం బారినపడినా.. తిరిగి విధుల్లోకి చేరాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు.
- డాక్టర్ జె.వెంకటి, హైదరాబాద్ జిల్లా వైద్యఆరోగ్య అధికారి
కోలుకుని తిరిగి సేవల్లోకి
వైరస్‌ను ఎదుర్కొనడానికి నేను ముందు నుంచే మానసికంగా సంసిద్ధంగా ఉన్నా. పాజిటివ్ వచ్చిందని తెలిసి మా అమ్మ పెద్దగా ఏడ్చేసింది. నేనే ధైర్యం చెప్పాల్సి వచ్చింది. ఇంట్లోనే చికిత్స పొందాను. రోజూ ఆహారంగా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తినేవాణ్ని. బాగా విశ్రాంతి తీసుకున్నాను. తెలుగు సాహిత్యం, సంగీతం నా వ్యాపకాలు. 21 రోజులు ఇంట్లోనే ఉన్నాను. నెగెటివ్ అని తేలిన తర్వాత.. 22వ రోజు విధుల్లో చేరాను. ఎప్పటిలాగే కిడ్నీ రోగులకు చికిత్స అందిస్తున్నా. కొవిడ్ బాధితులకు సరైన సమయంలో చికిత్స చేస్తే కోలుకునే అవకాశాలే ఎక్కువ. వైరస్ లక్షణాలను దాచి పెట్టుకోవద్దు. ఆక్సిజన్ సమయానికి అందిస్తే మంచి ఫలితముంటుంది.
-డాక్టర్ శ్రీభూషణ్‌రాజు, నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి
సేవే పరమావధిగా..
ఈయన పేరు డాక్టర్ సందీప్ జాదవ్. ఆదిలాబాద్ రిమ్స్‌లో కొవిడ్ నోడల్ అధికారి. సొంత ఊరు ఉట్నూర్ మండలంలోని శ్యామానాయక్ తండా. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రుల్లో మంచి వేతనంతో పని చేయటానికి ఆహ్వానాలు అందినా, ఈయన వెళ్లలేదు. మన జిల్లాలో ఎందరో అభాగ్యులకు సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారని, వారిని ఆదుకోవాలని తన తండ్రి చెప్పిన మాటలకు గౌరవమిచ్చి రిమ్స్‌లో విధుల్లో చేరారు. రెండేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన నాలుగు నెలలుగా కొవిడ్ వార్డులో బాధితులకు సేవలందిస్తున్నారు. తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి పాజిటివ్ వచ్చినా వృత్తిలో వెనుకడుగు వేయలేదు.
రోగి కోలుకుంటే ఆ సంతృప్తే వేరు
కొవిడ్ బాధితులకు ధైర్యం చెప్పడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తాను. మందుల కంటే మనోధైర్యమే త్వరగా కోలుకునేలా చేస్తుంది. ఇక్కడ కరోనా నోడల్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు.. బాధితులు కోలుకుని ఇళ్లకు వెళ్తుంటే ఆ సంతృప్తి మాటల్లో చెప్పలేం. ఇప్పుడు వందల్లో కేసులొస్తున్నా ఎంజీఎం వైద్యులు నిరంతరాయంగా సేవలందిస్తున్నారు. నిత్యం కరోనా పాజిటివ్‌లతో ఎక్కువ సేపు గడపాల్సి వస్తుంది. అప్పుడప్పుడూ నాలోనూ లక్షణాలు కనిపిస్తుంటాయి. మందులు వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటాను.
- డాక్టర్ వి.చంద్రశేఖర్, ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్, ఎంజీఎం ఆసుపత్రి
మనో నిబ్బరంతో జయం
విధుల్లో ఉండగానే పాజిటివ్‌గా తేలింది. ఇంట్లోనే ఉండి చికిత్స పొందాను. కొందరు ఇంటి వద్ద ఉండనీయకుండా ఇబ్బందులు పెట్టారు. కనీసం పాలు పోసేవారిని కూడా రానీయకుండా అడ్డుకున్నారు. మా ఇంటి నుంచి చెత్త తీసుకెళ్లకుండా ఆపేశారు. అయినా నేను మనోనిబ్బరం కోల్పోలేదు. ఫోన్ ద్వారా వైద్యసలహాలు పొంది కోలుకున్నాను. గత 10 రోజులుగా విధులకు హాజరవుతున్నా.
- ఎం.కవిత, నర్సు, సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి
వస్తుందని తెలిసే ధైర్యంగా ఎదుర్కొన్నా
కరోనా కట్టడికి విధులు నిర్వర్తిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉన్నా, ఏదో ఒకరోజు వైరస్ అంటుకుంటుందని తెలిసినా ధైర్యంగా ఉన్నా. ఒకరోజు నలతగా ఉండడంతో పరీక్ష చేయిస్తే పాజిటివ్ వచ్చింది. ఇంట్లోనే ప్రత్యేక గదిని తీసుకున్నా.ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకున్నా. పది రోజుల్లోనే కోలుకున్నా.
-డీఎస్ చౌహాన్, అదనపు సీపీ(శాంతిభద్రతలు)
ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధం
వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు నెల రోజులు శ్రమించాం. జులై 7న నాకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఎప్పుడూ ప్రజలతో మమేకమయ్యే పరిస్థితి నుంచి హోం ఐసోలేషన్‌లో ఒంటరిగా ఉండటంతో ఇబ్బందిగా అనిపించింది. పదిహేను రోజుల్లోనే కోలుకుని విధుల్లో చేరా. ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.
-రఘువీర్, ఇన్‌స్పెక్టర్, రాచకొండ
మనోధైర్యంతో నిలబడ్డా
కరోనా చికిత్స మొదలైనప్పటి నుంచీ పోస్టు ఆపరేటివ్ వార్డులో విధులు నిర్వర్తిస్తున్నా. ఆక్సిజన్ అత్యవసరమైన బాధితుల్ని ఈ వార్డుకి తీసుకొచ్చేవాళ్లం. ప్రమాదకరమని తెలిసినా పీపీఈ కిట్లు, అన్ని జాగ్రత్తలతో పనిచేశాం. అయినా జూన్ నెలాఖరులో నాకూ కరోనా సోకింది. మొదట భయపడినా, మనోధైర్యంతో నిలబడ్డా. 17 రోజుల్లో కోలుకుని మళ్లీ విధుల్లో చేరా.
- లక్ష్మి, స్టాఫ్‌నర్సు, గాంధీ ఆసుపత్రి
వ్యర్థాలు తొలగిస్తుంటే వైరస్ సోకింది
ఖైరతాబాద్ మున్సిపల్ కార్యాలయం పక్క వీధిని కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించినప్పుడు మేం అక్కడ విధులు నిర్వర్తించాం. కొవిడ్ రోగులు, వారి ఇంటి సభ్యులు అవగాహన లేక వ్యర్థాలను వీధిలో పారేసేవారు. గ్లౌజులు, మాస్కులు, ఇతర ఆహార వ్యర్థాలను పారతో లాగి బండిలో వేసేవాళ్లం. ఆ క్రమంలో వైరస్ సోకి ఉండొచ్చు. జ్వరం రావడంతో పరీక్ష చేయించుకోగా, పాజిటివ్ అని చెప్పారు. ఇంట్లో ఉండి చికిత్స తీసుకోమన్నారు. రెండు వారాలకు పూర్తిగా కోలుకున్నా. మునుపటిలాగే విధుల్లో పాల్గొంటున్నా.
- డి.ప్రసాద్, పారిశుద్ధ్య కార్మికుడు, జీహెచ్‌ఎంసీ