పార్లమెంటులో చట్టాలు చేసే ఎంపీలు వాళ్లంతా.. రాష్ట్ర ప్రయోజనాలు, స్థానికుల అవసరాలపై రైల్వేశాఖకు వినతులు పంపారు. ఇలా తెలుగు రాష్ట్రాల నుంచి రెండువందల వరకు వినతులు దక్షిణ మధ్య రైల్వేకు అందాయి. కొత్త రైళ్లు కావాలని.. ఉన్నవి పొడిగించాలని.. కొత్త లైన్లు కావాలని, స్టేషన్లలో ఎస్కలేటర్లు, అదనపు టికెట్ కౌంటర్లు పెట్టాలని, రోడ్ అండర్‌బ్రిడ్జిలు కావాలని అడిగారు. వీటికి దక్షిణ మధ్య రైల్వే ‘‘నడిపించలేం.. పొడిగించలేం.. కొత్త రైళ్లు వేయలేం..’’ అంటూ సమాధానమిచ్చింది. ఇటీవల తెలుగు రాష్ట్రాల ఎంపీలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించిన రైల్వే వారి వినతులకు తాజాగా సమాధాలు పంపింది. వాటిని పరిశీలిస్తే కనీసం రైల్వే బోర్డుకు నివేదించకుండానే 90 శాతం వరకు వినతులను జోన్ స్థాయిలోనే తిరస్కరించినట్లు తెలుస్తోంది. నిజానికి కొత్త ప్రాజెక్టులు, రైళ్లు, అదనపు స్టాపేజీలపై నిర్ణయం రైల్వేబోర్డుది. ఎంపీల ప్రతిపాదనల్ని జోన్ స్థాయిలోనే తీసిపారేస్తే రైల్వేబోర్డుకు చేరేదెలా? అనేది ఇక్కడి ప్రధాన సందేహం.
ఆగితేనే కదా తెలుస్తుంది!
ఎంపీలు ప్రధానంగా ముఖ్యస్టేషన్లలో ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆపాలని కోరారు. వాటిలో ఆదాయం పెద్దగా రాదని రైల్వే బదులిచ్చింది. ప్రయోగాత్మకంగా ఆరునెలలు ఆపితే ప్రయాణికుల డిమాండ్ తెలుస్తుందనేది నిపుణుల పేర్కొన్నారు. హైదరాబాద్-అజ్మీర్ రైలు ఫ్రీక్వెన్సీ పెంచాలని, కర్నూలు-అజ్మీర్ మధ్య రైలు కావాలని అడిగితే ఇతర జోన్లు అంగీకరించట్లేదని పేర్కొంది. అలాగే దేవరకద్రలో 8 రైళ్లు ఆపాలని కోరితే సికింద్రాబాద్-కర్నూలు రైలు ఆపడానికే సానుకూలంగా స్పందించింది.
గూడ్సు రైళ్లు తిరుగుతున్న విష్ణుపురం-జాన్‌పహాడ్ మార్గంలో ప్రయాణికుల రైళ్లు నడిపితే సికింద్రాబాద్-విజయవాడకు కొత్త మార్గంతో పాటు 60 కి.మీ. దూరం తగ్గుతుందని ఎంపీలు అడిగితే.. ఆ మార్గంలో రద్దీ బాగా ఉందని దమ రైల్వే స్పష్టంచేసింది. రోజుకు 2, 3 ప్రయాణికుల రైళ్లు నడపలేనంత రద్దీగా ఉందా? అనేది వారికే తెలియాలి. ‘హైదరాబాద్-విజయవాడ రైలు ప్రయాణం ఆరేడు గంటలు. రోడ్డు మార్గంలో వెళ్తే నాలుగున్నర గంటలే. నిత్యం 1500 బస్సులు తిరుగుతున్నాయి. జాతీయ రహదారి 65కు సమాంతరంగా చిట్యాల-జగ్గయ్యపేట మధ్య కొత్త రైల్వేలైను వేయండి’ అని ఎంపీలు కోరితే ‘మాకు సంబంధం లేదు. నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్‌ను అడగండి’ అంటూ తేల్చేయడం గమనార్హం.
ఒకటి అడిగితే మరో మెలిక
ఏపీ నుంచి 14 మంది, తెలంగాణ నుంచి 16 మంది ఎంపీలు రైళ్లు, ప్రాజెక్టుల గురించి అభ్యర్థనలు అందజేశారు. ఆలేరులో రైలు ఆపాలని ఒక ఎంపీ అడిగితే.. జనగామ వెళ్లి ఎక్కాలని.. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను ఆపమని కోరితే.. దక్షిణ్‌లో ఎక్కమని, మహబూబాబాద్ స్టేషన్‌కు ఎస్కలేటర్ కావాలంటే.. ప్రయాణికుల సంఖ్య 25 వేలకు పెరగాలని, గుంటూరు-వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను తాండూరుకు పొడిగించమంటే కుదరదని, చంద్రగిరి స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపితే శ్రీవారిమెట్టు, శ్రీనివాస మంగాపురం వెళ్లే యాత్రికులకు ఉపయోగకరంగా ఉంటుందంటే అక్కడ ఇప్పటికే ఆగే రైళ్లు ఉన్నాయి కదా అంటూ దమ రైల్వే సాకులు చెప్పింది.
ఇదీ చదవండి: 'బాధితులకు న్యాయం జరిగేంతవరకు పోరాడతాం'