సౌర విద్యుత్తు పరంగా ఏపీలోని విశాఖ నగరంలో అవగాహన పెరుగుతోంది. ప్రత్యేకించి భారీ పరిశ్రమలు, సంస్థలు (ఎల్‌టీ కనెక్షన్లు) వీటిని ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజా గణాంకాల్ని బట్టి ఈపీడీసీఎల్ 5 జిల్లాల్లో ఏర్పాటైన సౌరపలకల ఉత్పత్తి సామర్థ్యంలో నగరవాటా సుమారు 28 నుంచి 30శాతం ఉంది.
పలు ప్రాజెక్టులతో పాటు 1046 సర్వీసు కనెక్షన్ల నుంచి ఈ విద్యుత్తు గ్రిడ్‌కు అందుతోంది. వీరంతా నెలనెలా తమ బిల్లుల్ని ఆదా చేసుకుంటున్నారు. ప్రస్తుతం నగరంలో మరిన్ని సంస్థలు సౌరప్లాంట్లను తెరిచే క్రమంలో వాటి దరఖాస్తులు ఏపీఈఆర్‌సీ పరిశీలనలో ఉన్నట్లు ఈపీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేక సౌర ప్రాజెక్టులు
విశాఖపట్నం పోర్టు ట్రస్టు సామర్థ్యం - 10 మెగావాట్లు. స్టీల్‌ప్లాంట్ (ఆర్‌ఐఎన్‌ఎల్) సామర్థ్యం - 5 మెగావాట్లు. మేఘాద్రిగెడ్డ తేలియాడే సౌరప్రాజెక్టు నిర్వాహణ - జీవీఎంసీ సామర్థ్యం - 3 మెగావాట్లు. ముడసర్లోవ తేలియాడే సౌరప్రాజెక్టు నిర్వాహణ - జీవీఎస్‌సీసీఎల్ సామర్థ్యం - 3 మెగావాట్లు. ఐఎన్‌ఎస్ కలింగ, భీమిలి సామర్థ్యం - 2 మెగావాట్లు. సింహాచలం దేవస్థానం సామర్థ్యం - 1 మెగావాట్. జీవీఎంసీతో కలిపి 12 అనుబంధ కార్యాలయాలు సామర్థ్యం 1.68 మెగావాట్. నగరంలో సౌరవిద్యుద్దీపాల స్తంభాల సంఖ్య - 2908. సామర్థ్యం - 82.81 కిలోవాట్లు.
‘ఒక మెగావాట్’ ఏం చేస్తుంది? పరిశోధకులు చెప్పినదాన్నిబట్టి..
* సోలార్ పలకలు ఒక మెగావాట్ విద్యుత్తు తయారుచేస్తే వాతావరణంలో ఏడాదికి వెలువడే 1000 టన్నుల కర్బన ఉద్ఘారాల్ని అదుపుచేసినట్లు లెక్క. ఒక్క మెగావాట్ సౌర విద్యుత్తు ఉత్పత్తి ఏడాదికి 5 వేల మొక్కల్ని నాటినదానితో సమానం.
‘ఇంటి’పైనే బెంగ
తమ ఇళ్ల పైకప్పులపై సౌరపలకల్ని ఏర్పాటు చేసుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపడంలేదనేది స్పష్టమవుతోంది. గత కొన్నేళ్లుగా ప్రజల్ని అవగాహన పరుస్తున్నా.. పథకాల అమలులో లోపాలతో సత్ఫలితాలు రావడంలేదు. సబ్సిడీలు మంజూరు కాకపోవడం, జీవోల ద్వారా తీసుకున్న నిర్ణయాలు పథకాల్లో అమలుకాకపోవడం సమస్యగా ఉంది. ఇన్ని సమస్యలున్నప్పటికీ సౌర విద్యుత్తుమీద మమకారంతో, పర్యావరణాన్ని కాపాడాలనే ఆసక్తితో నగరంలో పలువురు ఆసక్తి కొద్దీ పలకలు ఏర్పాటుచేసుకున్నారు. ఇలాంటివారు 640 మంది ఉన్నారు.
ఇవీ చదవండి: బియ్యం రాయితీకి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం