ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో గురుకుల విద్యార్థులు మరోసారి తమ ప్రతిభ కనబరిచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. ఫలితంగా గతేడాదితో పోల్చితే గురుకులాల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. ఎస్సీ గురుకులాల్లో 84.81 శాతం నుంచి 89.38 శాతానికి, గిరిజన గురుకులాల్లో 82.38 శాతం నుంచి 85.08 శాతానికి పెరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాఠోడ్‌లు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎస్సీ గురుకులాల్లో..
ఎస్సీ గురుకులాల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 10,084 మంది పరీక్షలు రాయగా.. వీరిలో 89.38 శాతంతో 8,995 మంది ఉత్తీర్ణత సాధించారు. 21 విద్యాసంస్థలు 100 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయని సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
మొదటి సంవత్సరంలో 10,747 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 70.07 శాతంతో 8,594 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 10 గురుకులాల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైందని ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
విద్యార్థి పేరు | ప్రాంతం | గ్రూపు | మార్కులు |
---|---|---|---|
నరేశ్ | గౌలిదొడ్డి | ఎంపీసీ | 988 |
నిరంజన్ | గౌలిదొడ్డి | ఎంపీసీ | 988 |
ఎస్.శ్రీజ | నల్లకంచ కాలేజీ | బైపీసీ | 987 |
డి.సాయికిరణ్ | ఇబ్రహీంపట్నం | ఎంఈసీ | 977 |
గిరిజన గురుకులాల్లో..
గిరిజన గురుకులాల్లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4,492 మంది విద్యార్థులు హాజరు కాగా.. వీరిలో 85.08 శాతంతో 3,822 మంది పాసయ్యారు. మొదటి సంవత్సరంలో 6,824 మంది పరీక్షలు రాయగా.. 72.5 శాతంతో 4,585 మంది ఉత్తీర్ణులయ్యారు.
విద్యార్థి పేరు | ప్రాంతం | గ్రూపు | మార్కులు |
---|---|---|---|
వినోద్ | రాజేంద్రనగర్ | ఎంపీసీ | 982 |
గణేశ్ | రాజేంద్రనగర్ | ఎంపీసీ | 982 |
కె.ప్రదీప్‌కుమార్ | ఖమ్మం | బైపీసీ | 977 |
బీసీ గురుకులాల్లో..
ఇక బీసీ గురుకులాల్లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులు 2,212 మంది పరీక్షలకు హాజరవగా.. వారిలో 2090 మంది ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో 2,320 మంది పరీక్షలు రాయగా.. 2083 మంది పాసయ్యారు. నాగార్జునసాగర్ బీసీ గురుకుల జూనియర్ కళాశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించింది.
ఇంటర్ పరీక్షలకు హాజరైన వారిలో అత్యధిక విద్యార్థులు ఏ గ్రేడు సాధించారని బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు పేర్కొన్నారు. రెండో సంవత్సరంలో 1510 మంది, మొదటి సంవత్సరంలో 1406 మంది ఏ గ్రేడు పొందారని తెలిపారు.
సెకండియర్..
విద్యార్థి పేరు | ప్రాంతం | గ్రూపు | మార్కులు |
---|---|---|---|
పి. గణేశ్ | చిట్యాల కళాశాల | ఎంపీసీ | 989 |
జి.రవితేజ | మహేశ్వరం కళాశాల | బైపీసీ | 983 |
పి.రాణాప్రతాప్ | నాగార్జునసాగర్ కళాశాల | ఎంఈసీ | 973 |
కె. భాస్కరాచారి | నాగార్జునసాగర్ కళాశాల | సీఈసీ | 974 |
ఫస్ట్ ఇయర్..
విద్యార్థి పేరు | ప్రాంతం | గ్రూపు | మార్కులు |
---|---|---|---|
ఎన్. సాయిశ్రీయ | జగదేవ్‌పూర్ గురుకులం | ఎంపీసీ | 466 |
వై. సౌజన్య | జగదేవ్‌పూర్ గురుకులం | బైపీసీ | 431 |
ఎన్.మానస | జగదేవ్‌పూర్ గురుకులం | ఎంఈసీ | 492 |
కె.రవితేజ | నాగార్జునసాగర్ | సీఈసీ | 487 |
ఎం. శ్రీజ | కరీంనగర్ గురుకులం | హెచ్.ఈ.సీ | 488 |
మరోవైపు గురుకులాల్లో చదువుతున్న తమ పిల్లలు ఉత్తమ ప్రతిభ కనబరచడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులూ హర్షం వ్యక్తం చేశారు.