Social And Emotional Skills Programme In Telangana Students : విద్యార్థుల్లో సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలను పెంచేందుకు దిల్లీ తరహాలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం, మానసిక, భావోద్వేగ శ్రేయస్సు, సామాజిక నైపుణ్యాలు దెబ్బతినకుండా వారిలో మనో ధైర్యం కల్పించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాకు ఒక పాఠశాల చొప్పున 6, 7వ తరగతి విద్యార్థులను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ఆమె తెలిపారు.
విద్యార్థుల్లో ప్రతికూల పరిస్థితులను, ఇబ్బందులను తొలగించి భవిష్యత్ పట్ల ఆశావాద దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇద్దరేసి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థి దశలోనే వ్యాపార ఆవిష్కరణలు ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. మొదటి దశలో 8 జిల్లాలోని 24 మోడల్ స్కూళ్లను ఎంపిక చేసి ఇంటర్ మొదటి సంవత్సరం చదివే 2,500 మంది విద్యార్థులను వ్యాపార ఆవిష్కరణలపై ప్రోత్సహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇలా చేయడం వల్ల విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెరిగి, భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడే భావిభారత పౌరులుగా తీర్చదిద్దబడతారని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ఒక్కో ఆవిష్కరణకు రూ.2000 బహుమానం : మెరుగైన 1500 ఆవిష్కరణలను ప్రోత్సహించి. ఒక్కో ఆవిష్కరణ కు రూ.2000లు ఇచ్చి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. వీరితో ప్రత్యేక ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేసి, భవిష్యత్ లో ఉత్తమ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. విద్యా శాఖపై మంత్రి నిర్వహించిన సమీక్షలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాల పెంపు : రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈనెల నుంచి పెంచిన వేతనాలను అందజేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దీని వల్ల రాష్ట్రంలోని 54201 మంది కుక్ కమ్ హెల్పర్లకు లబ్ధి చేకూరుతుందని మంత్రి వివరించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని అధికారులకు శనివారం జరిగిన సమావేశంలో తెలిపారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భాష, గణిత సామర్థ్యాలను పెంచేందుకు అమలు చేస్తున్న తొలిమెట్టు కార్యక్రమానికి ప్రత్యేక వార్షిక ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి పేర్కొన్నారు.
ఇవీ చదవండి :