కొంచెం తాగితే ఏమవుతుందిలే.. తనిఖీల్లో చూసీచూడనట్లు వదిలేస్తారనే అన్న ధీమాతో రోడ్డెక్కినట్లు ఎక్కువ మంది చెబుతుండటంతో పోలీసులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ఆరు నెలల్లో నమోదైన కేసులను పరిశీలించగా సుమారు 50 శాతం మంది ఈ కేటగిరీలోనే ఉన్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు.
సాధారణంగా మందుబాబుల రక్త నమూనాల్లో మద్యం మోతాదు (బీఏసీ)ను రక్త నమూనాలను విశ్లేషించి లెక్కిస్తారు. 100 ఎంఎల్ రక్తంలో మద్యం మోతాదు 30 ఎంజీ లోపు ఉంటే వదిలేస్తారు. 36, అంతకంటే ఎక్కువగా ఉంటే కేసు నమోదు చేస్తారు. 100 ఎంజీల్లోపు నమోదైన వాళ్లంతా కొంచెం తాగితే ఏమవుతుందిలే అంటూ బదులిచ్చారు. జనవరి నుంచి జూలై 3 వరకు 20,326 మంది మందుబాబులు పోలీసులకు చిక్కారు. వీరిలో 10,570 మంది బీఏసీ 100 ఎంజీల్లోపే ఉండటం గమనార్హం.
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే పట్టుపడుతున్నారు. వీరిలో 15,456 మంది ద్విచక్ర వాహనదారులే కావడం గమనార్హం. అంటే ఈ లెక్కన చూస్తే దొరికిపోయిన వాహనాల్లో 75 శాతానికి పైగా ఇవేనన్న మాట.
వయసు వారీగా మందుబాబుల పోలీసులు లెక్క తేల్చారు. సుమారు 50 శాతం 26 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారే ఉండటం గమనార్హం. మైనర్లు బండి నడపడమే నేరం. అలాంటిది ఏకంగా మద్యం తాగి వాహనం నడుపుతూ 10 మంది చిక్కడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురుషులే కాదు.. 10 మంది మహిళలు పోలీసులకు చిక్కారు.
రోజూ తనిఖీలు...
కొంచెం తాగితే ఏమవుతుందననే ధీమాతో చాలా మంది వాహనదారులు రోడ్డెక్కుతున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రతిరోజూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నాం. డ్రైవింగ్ లైసెన్స్, బండిని స్వాధీనం చేసుకుంటున్నాం. లైసెన్స్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేయిస్తున్నాం. ఆ సమయంలో బండి నడుపుతూ దొరికితే రూ.10వేల జరిమానా, 3 నెలల జైలు శిక్ష పడుతుంది. సస్పెన్షన్ వ్యవధి ముగియగానే రోడ్డెక్కితే అదీ కూడా నేరమే. డ్రైవర్ రిఫ్రెషర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాతే బండి నడపాలి. - ఎస్‌ఎం విజయ్‌కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ
ఇదీ చూడండి: Dead Bodies : చెరువులో ముగ్గురు బాలికల మృతదేహాలు లభ్యం