రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన షైన్ ఆసుపత్రి ఘటనపై అధికారులు విచారణ వేగవంతం చేశారు. అగ్ని ప్రమాదానికి ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది నిర్వాకమే కారణమని పోలీసులు తేల్చారు. ఈ నెల 20 తెల్లవారుజామున 2గంటల సమయంలో ఆసుపత్రి నాలుగో అంతస్తులోని ఏసీ కంట్రోల్ కేంద్రంలో పేలుడు సంభవించినట్టు దర్యాప్తులో తేలింది. సమీపంలో ఉన్న అత్యవసర చికిత్స విభాగంలోని ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి విక్కీ అనే 4 నెలల పసికందు ఊపిరి ఆడక మృతి చెందగా... మరో నలుగురు గాయపడ్డారు. ఘటనా సమయంలో ఆసుపత్రిలో 43 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు.
అందరి నిర్లక్ష్యం తీసింది... నిండుప్రాణం
ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు విధుల్లో ఉన్న వైద్యుడు హరికృష్ణ అత్యవసర చికిత్స విభాగానికి వచ్చారు. విధుల్లో ఉన్న నర్సులు శాంతిదీపిక, స్రవంతి... ప్రమాదం గురించి తెలిసినప్పటికీ పట్టించుకోలేదని విచారణలో బయటపడింది. ఎలక్ట్రీషియన్ బషీర్ కూడా విధి నిర్వాహణలో అలక్ష్యం ప్రదర్శించినట్టు పోలీసులు తెలిపారు.
అనుమతులు లేకుండా ఆస్పత్రి నిర్వహణ
ఎలాంటి అనుమతులు లేకుండానే ఎండీ సునీల్‌కుమార్‌రెడ్డి షైన్ ఆసుపత్రి నిర్వహిస్తున్నట్టు తేలింది. అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం తీసుకోకుండా, సరైన అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయలేదని నిర్ధరించారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం... విచారణ కమిటీ ఏర్పాటు చేసి వారి నుంచి నివేదిక స్వీకరించింది. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యాన్ని స్పష్టంగా ప్రభుత్వానికి కమిటీ తేటతెల్లంచేసింది. ఆసుపత్రి ఎండీ సునీల్‌కుమార్‌రెడ్డి, వైద్యుడు హరికృష్ణ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సులు, ఎలక్ట్రీషియన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్ని తనిఖీ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.