హైదరాబాద్ ఛాతి ఆసుపత్రిలో నెలకొన్న మరణాలపై దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఆక్సిజన్, వెంటిలేటర్ తొలగించి ఇద్దరు రోగుల మరణాలకు కారణమైన వారిపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయాలన్నారు.
రోగులు ప్రాణాలు కోల్పోయే కొన్ని గంటలు లేదా నిమిషాల ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో వారి ఆందోళన కనిపించిందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వైద్య పరిభాషను ఆరోగ్యమంత్రి దుర్వినియోగం చేశారని అరోపించారు.
రోగి గుండెపోటుతో మరణించాడని, ఆక్సిజన్ థెరపీ లేకపోవడం వల్ల కాదన్నారని.. కార్డియాక్ అరెస్ట్‌కు దారితీసే అంశాలను తెలుసుకోడానికి సాధారణ గూగుల్ సెర్చ్ చేయాలని షబ్బీర్ అలీ విడుదల చేసిన ప్రకటనలో మంత్రిని కోరారు. రోగుల ఇద్దరి సెల్ఫీ వీడియోలను 'డైయింగ్ డిక్లరేషన్' గా పరిగణించాలని, వారి మరణాలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అతని క్యాబినెట్ మంత్రులు బానిసలయ్యారని.. స్వీయ ప్రశంసలు తప్ప బయట జరుగుతున్న వాస్తవాలు సీఎం దృష్టికి తీసుకు రావడానికి జంకుతున్నారని విమర్శించారు. తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మరణించిన రోగులందరికీ న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తుందని షబ్బీర్ అలీ అన్నారు.
ఇదీ చదవండి: 1 లేదా 2న రాష్ట్ర కేబినెట్ భేటీ? లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం