బోర్డుల పరిధిలోకి వచ్చిన కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టుల వద్ద భద్రతకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఈనెల 7న కృష్ణా బోర్డు రాసిన లేఖ, ఇందులో ప్రాజెక్టుల వద్ద భద్రతకు నియమించే సీఐఎస్‌ఎఫ్ బలగాలకు కల్పించాల్సిన సౌకర్యాల వివరాలను పరిగణనలోకి తీసుకుంటే ఏటా వందల కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉన్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రెండో షెడ్యూల్లో పేర్కొన్న ప్రాజెక్టులు పూర్తిగా బోర్డుల పర్యవేక్షణలోనే ఉంటాయి. నోటిఫికేషన్ ప్రకారం కృష్ణా బేసిన్‌లోని 12, గోదావరి బేసిన్‌లోని 16 ప్రాజెక్టులు రెండో షెడ్యూల్లో ఉన్నా, కృష్ణాలో మొత్తం 40కి పైగా ఔట్‌లెట్లు ఉన్నాయి. ఉదాహరణకు శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోనే రెండువైపులా విద్యుత్తు కేంద్రాలు, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ముచ్చుమర్రి, బనకచెర్ల మొదలుకొని దిగువన తెలుగుగంగ, కల్వకుర్తి.. ఇలా మొత్తం 19 పాయింట్లు బోర్డు పరిధిలోకి వస్తాయి. నాగార్జునసాగర్ కింద 18 ఉన్నాయి. ఈ రెండుచోట్లే భారీగా సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అవసరం. ఈ బలగాలను నియమించాలంటే ముందుగా ఏమేం చేయాలి, ఎంత మొత్తం డిపాజిట్ చేయాలి తదితర వివరాలన్నీ కేంద్రహోం శాఖ నుంచి జల్‌శక్తికి రాగా, అక్కడి నుంచి కృష్ణా, గోదావరి బోర్డులకు, వాటి ద్వారా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చేరాయి.
ఖర్చు వందల కోట్లలో?
మొత్తం ఎంతమంది సిబ్బంది అవసరమో నిర్ణయించాక, మూడు నెలల మొత్తం డిపాజిట్ చేయాలి. 2021-22లో నిర్ణయించిన ప్రకారం సిబ్బంది ఒక్కొక్కరికి రూ. 2.36 లక్షల చొప్పున డిపాజిట్ చెల్లించాలి. ఇక్కడ నియమించే సిబ్బందిలో డీఐజీ మొదలుకొని కానిస్టేబుల్ వరకు 13 స్థాయులకు చెందిన వారున్నారు. ఒక్కో యూనిట్‌లో వారి జీతాలు, ఇతర అలవెన్సులకు ఏడాదికి రూ. కోటీ 88 లక్షలు ఖర్చవుతుందని అంచనా. సీఐఎస్‌ఎఫ్ నిబంధనల ప్రకారం ఒక్కో యూనిట్‌లో ఎంతమంది ఉండాలో కూడా లెక్క ఉంటుంది. ప్రాజెక్టులు, కాలువల వద్ద వందల సంఖ్యలో సిబ్బంది అవసరమవుతారు. ఈ సంఖ్య నిర్ధారణ అయ్యాక వాస్తవ ఖర్చు ఎంతో తేలుతుందని సంబంధితవర్గాలు చెబుతున్నా, వందల కోట్లలో ఉంటుందని పేర్కొంటున్నాయి.
వసతి బాధ్యత బోర్డులదే
సిబ్బంది కోసం వసతిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఉన్నత ర్యాంకు అధికారికి 1500 చదరపు అడుగులు ఉంటే కానిస్టేబుల్‌కు 385 చదరపు అడుగులు ఉంది. పెళ్లికాని సిబ్బందికి ఏర్పాటు చేసే బ్యారక్‌లు, కిచెన్, ఇతర వసతుల గురించి వివరించడంతోపాటు వాహనాలు కూడా ఏ స్థాయి అధికారికి ఏమేం ఉండాలో స్పష్టంగా పేర్కొన్నారు. సిబ్బందికి అవసరమైన అన్ని రకాల వసతులు, ఏర్పాట్లను బోర్డులే భరించాల్సి ఉంటుంది. అంటే రెండు ప్రభుత్వాలు. కృష్ణా బోర్డు మంగళవారం, గోదావరి బోర్డు అంతకుముందే రాసిన ఈ లేఖలకు రెండు ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.
ఇదీ చూడండి: KRMB LETTER: 'వసతి, సౌకర్యాల పూర్తి వివరాలను వీలైనంత త్వరగా పంపాలి'