Secunderabad fire accident updates : సికింద్రాబాద్ అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ భవనంలో ఒక మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. మృతదేహం అవశేషాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు. మృతదేహాన్ని గుర్తించేందుకు వైద్యులు డీఎన్ఏ పరీక్ష చేయనున్నారు. అగ్ని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ఆచూకీ లేకుండా పోయారు. వారిని వసీం, జహీర్, జునేద్ అని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం దొరికిన మృతదేహాం ఎవరిది అని తేల్చేందుకు.. ముగ్గురి కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ సేకరించనున్నారు. ఫలితాలు రాగానే సరిపోల్చనున్నారు. అగ్నికీలలు, దట్టమైన పొగ వల్ల.. మృతదేహాల గుర్తింపు ఆలస్యమైంది. భవనం మొదటి అంతస్తులో ప్రస్తుతం ఒక మృతదేహం ఆనవాళ్లను అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. మంటలు చెలరేగిన సమయంలో దుకాణంలో ఉన్న తమ వస్తువులు తెచ్చుకునేందుకు ముగ్గురు లోపలికి వెళ్లారని ఇతర సిబ్బంది వెల్లడించారు. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదంలో ముగ్గురూ చనిపోయి ఉంటారని భావించగా.. తాజాగా ఒకరి మృతదేహాం ఆనవాళ్లు లభ్యమయ్యాయి. కనిపించకుండా పోయిన మిగతా ఇద్దరి జాడ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.
సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆరంతస్తుల డెక్కన్ స్పోర్ట్స్ భవనంలో మంటలు ఎగసిపడ్డాయి. భవనం నలువైపుల నుంచి అగ్నికీలలు ఎగిసిపడగా.. చుట్టూ మొత్తం పొగ అలుముకుంటోంది. ఇప్పటివరకూ భవనంలో చిక్కుకున్న ఐదుగురిని సిబ్బంది రక్షించారు. 22 ఫైరింజన్లతో మంటలార్పారు. ఎట్టకేలకు మంటలు చల్లారాయి.
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఈనెల 25న సమీక్ష: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఈనెల 25న వివిధ శాఖలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. అదేవిధంగా అఖిల పక్ష సమావేశం కూడా నిర్వహిస్తామని చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన భవనం వంటివి.. నగరంలో సుమారు 25,000 ఉన్నట్లు వెల్లడించారు. అయితే అక్రమ కట్టడాలను రాత్రికి రాత్రికి తొలగించలేమని.. వాటిని ఏం చేయాలనే విషయంపై ఉన్నత స్థాయి కమిటి ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
మరోవైపు ఈ భవనాన్ని ఎన్ఐటీ వరంగల్ సంచాలకులు రమణారావు జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, క్లూస్ టీం, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. వెళ్లటానికి వీలులేని చోటుకు డ్రోన్‌ను పంపి నలుమూలలా తనిఖీలు జరిపి, నాణ్యతను పరీక్షించారు. అన్ని అంతస్తుల స్లాబులు, గోడలు దెబ్బతిన్నట్లు గుర్తించిన నిపుణులు ఏ సమయంలోనైనా పడిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. నిపుణుల హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటనాస్థలానికి పరిసర ప్రాంతాల్లోని కాలనీవాసులను ఖాళీ చేయిస్తున్నారు. భవనం దానంతటదే పడిపోక ముందే కూల్చివేయటం మేలని నిర్ణయించిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.
ఇవీ చదవండి: సికింద్రాబాద్ అగ్నిప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ కాదు.. మరి దేనివల్ల?
'భవనం కూల్చేస్తాం.. ఎవరికైనా నష్టం జరిగితే పరిహారం చెల్లిస్తాం'
'ఆ దాడి అంతా డ్రామా.. నిందితుడు ఆప్ కార్యకర్తే'.. భాజపా ఆరోపణ.. స్వాతి ఫైర్!