ఏపీలో గతేడాది వాయిదా పడిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభించేందుకు న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నట్టు... ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కొనసాగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 16వ తేదీన విజ్ఞప్తి చేసిందని తెలియచేసింది. నామినేషన్లు, ఏకగ్రీవాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కొన్ని ఫిర్యాదులు, అభ్యర్థనలు అందాయని ఎస్ఈసీ తెలిపింది.
పోటీలో ఉన్న అభ్యర్థుల నామినేషన్లను బలవంతంగా ఉపసంహరించేలా ఘటనలు జరిగినట్టుగా రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులందాయని ఎస్ఈసీ స్పష్టం చేసింది. నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలకు సంబంధించి ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ల నుంచి నివేదిక కోరినట్టు వెల్లడించింది. ఫిబ్రవరి 20వ తేదీలోగా దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు కమిషన్ తెలిపింది.
బాధిత అభ్యర్థులు నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలకు సంబంధించిన ఆధారాలతో జిల్లా కలెక్టర్లను సంప్రదించాలని కోరింది. రిటర్నింగ్ అధికారులు, పోలీసుల వద్ద దాఖలు చేసిన ఫిర్యాదులు, మీడియాలో వచ్చిన కథనాలు తదితర ఆధారాలను సమర్పించాలని సూచించింది. దీనిపై తగిన ఆధారాలు లభ్యమైతే నామినేషన్లను పునరుద్ధరించే అధికారాలను కలెక్టర్లకు బదలాయించినట్టు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ తరహా ఘటనలపై నివేదికను ఫిబ్రవరి 20వ తేదీలోగా కమిషన్‌కు సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వీటిని పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలకు కమిషన్ ఉపక్రమిస్తుందని ఎస్ఈసీ రమేశ్‌కుమార్ వెల్లడించారు.
ఇదీ చదవండి: సినీనటుడు మోహన్‌బాబుకు జీహెచ్‌ఎంసీ నోటీసులు