గ్రేటర్ హైదరాబాద్ నగరపాలిక పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నికకు కొవిడ్ నిబంధనలకు లోబడి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి ఆదేశించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, అధికారులు, పోలీస్ అధికారులతో సమావేశమైన ఎస్ఈసీ.. ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్భంగా ప్రచారం, పోలింగ్లో కొవిడ్ నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించాలన్న ఆయన.. పోలింగ్ ముగిసే సమయానికి 72 గంటల ముందు నుంచి ఎలాంటి సభలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖ నోడల్ అధికారిని నియమించాలన్న పార్థసారధి.. కొవిడ్ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలయ్యేలా పర్యవేక్షించాలని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఆరోగ్యశాఖ సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం, మాస్కు వినియోగం, శానిటైజర్లు విధిగా ఉండేలా చూడాలని చెప్పారు. థర్మల్ స్కానర్లు, వీల్ ఛైర్లు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పార్థసారధి ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉండాలని తెలిపారు. పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకొని బందోబస్తు ప్రణాళిక రూపొందించాలన్న ఎస్ఈసీ.. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కనీసం నలుగురు పోలీస్ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా ప్రాణ వాయువును సరఫరా చేస్తోన్న రైల్వే