Saras Fair in hyderabad: హైదరాబాద్ నగరవాసులను.. పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన.. సరస్ ఎగ్జిబిషన్ కనువిందు చేస్తోంది. భారతీయ సంప్రదాయ కళాకారుల్లో.. అత్యధిక భాగం గ్రామీణ మహిళలే. వనరులు, అవకాశాలు, సామాజిక పరిమితుల కొరత కారణంగా.. వారు తమ జీవన పరిస్థితులను పెంచుకోలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ప్రాణం పోసుకున్నవే.. స్వయం సహాయక బృందాలు. మహిళలకు మరింత మెరుగైన అవకాశాలను అందిస్తూ.. వారిని సొంత కాళ్లపై నిలబెట్టేందుకు ఉపయోగపడుతున్నాయి.
ఎక్కడో మారు మూల గ్రామాల్లో ఉంటూ, బతుకు తెరువు తెలియక ఇబ్బంది పడుతున్న వారి కోసమే.. ఈ సంఘాలు. అలాంటి ఉపయోగకరమైన సంఘాల వారందరినీ.. ఒకే చోట చేరుస్తూ.. ప్రజలకు హస్త కళల గొప్పతనాన్ని చాటి చెప్పే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సరస్ ఎగ్జిబిషన్‌కు.. నగరవాసుల నుంచి విశేష స్పందన వస్తోంది. తక్కువ ధరలకే.. అరుదైన, నాణ్యమైన, కనువిందు చేసేలాంటి వస్తువులు ఒకే చోట లభించడంతో వినియోగదారులు ఎగ్జిబిషన్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్టాల్స్ నిర్వాహకులు వైవిధ్యంగా తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.
ఎంతో మంది స్వయం సహాయక బృందాలకు.. ప్రజలలోకి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్న సరస్ ఎగ్జిబిషన్‌లో.. వివిధ రాష్ట్రాలకు చెందిన హస్త కళాకారులు, చేనేత కార్మికులు, నాణ్యమైన వంట నూనెలు తయారు చేసే వారందరూ స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మూలిక వైద్యానికి సంబంధించిన మందులు కూడా సరస్‌లో విక్రయిస్తున్నారు. చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మల నుంచి.. వంటింట్లో వాడే సామాన్ల వరకు అన్ని ఒకే దగ్గర అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని 32 జిల్లాలతో పాటు 22 రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు.. ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం 300 స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సంప్రదాయ కళలు, చేతి వృత్తి కళాకారులు, చేనేత కార్మికులను ఒక దగ్గర చేరుస్తూ.. ఏర్పాటు చేసిన సరస్ ఎగ్జిబిషన్‌కు నగర వాసులందరూ వచ్చి.. వారిని ప్రోత్సహించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: