Jagga Reddy meet CLP: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. పార్టీలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ను వీడుతున్నట్లు జగ్గారెడ్డి ఇటీవల ప్రకటించారు. తాజాగా సీఎల్పీ నేత భట్టివిక్రమార్కతో ఆయన హైదరాబాద్లోని సీఎల్పీ కార్యాలయంలో భేటీ అయ్యారు. పార్టీలో తనపట్ల అవమానాలను జగ్గారెడ్డి ఆయనకు వివరించారు. జగ్గారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.
రేపు సంగారెడ్డి నియోజక వర్గ కార్యకర్తలతో భేటీ కానున్న జగ్గారెడ్డి సీఎల్పీ భట్టితో సమావేశం కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. గత కొంతకాలంగా పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలను, ఇబ్బందులను భట్టి విక్రమార్కతో చర్చించినట్లు తెలుస్తోంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్కే ఇబ్బందులు ఎదురవుతుంటే ఇతర నాయకుల పరిస్థితులు ఏలా ఉందోనని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు సామాజిక మాధ్యమాలల్లో దుష్ప్రచారం చేస్తూ తెరాసకు కోవర్టుగా అభివర్ణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కారణంగా పార్టీకి నష్టం జరగకూడదనే బయటకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. పీసీసీ రేవంత్ రెడ్డికి దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలు ఒక్కచోట చేరి ప్రత్యేకంగా సమావేశవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పార్టీలోనే ఉంటారని భావిస్తున్నాం: భట్టి
జగ్గారెడ్డి లేవనెత్తిన అంశాలపై అధిష్ఠానంతో మాట్లాడుతామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. జగ్గారెడ్డి పార్టీలోనే ఉంటారని భావిస్తున్నామని వెల్లడించారు. రాజీనామా విషయంలో వెనక్కి తగ్గారనే అనుకుంటున్నామన్నారు. జగ్గారెడ్డి కార్యకర్తల సమావేశానికి, రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఇదీ చూడండి: