ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ అంటే అంగీకరించేది లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
‘అప్పటికీ, ఇప్పటికీ ఏం తేడా ఉందో తెలియడం లేదు. ఇంకో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అయితే ఏమన్నా అనుకోవచ్చు. అప్పుడు, ఇప్పుడూ ఆయనే ఎస్‌ఈసీగా ఉన్నారు. అన్నీ బాగానే జరిగాయి. ఏకగ్రీవాలు సక్రమంగానే ఉన్నాయని ఆ రోజు చెప్పారు. మధ్యలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆయనే ఎన్నికల్ని అడ్డుకున్నారు. ఇప్పుడు ప్రశాంతంగా జరిగాయని చెబుతున్నారు. మేం ఎన్నికలకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. తాజాగా మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ అంటే అంగీకరించం. పిల్లలాటల్లా చేస్తే ఊరుకోం. న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం. గత నామినేషన్లకు (ఏకగ్రీవాల స్థానాల్లో) సంబంధించి ఏం తనిఖీ చేసినా, ఎన్నిసార్లు పరిశీలించినా మాకు అభ్యంతరం లేదు. ఆయన మీద ఆయనకు అనుమానం వస్తే తప్ప యథాతథంగానే జరుగుతాయనుకుంటున్నాం’ అని ఆయన అన్నారు. ‘కుప్పం నియోజకవర్గంలో 2019 ఎన్నికలతో పోలిస్తే తెదేపా కంటే వైకాపా మద్దతుదారులకు పంచాయతీ ఎన్నికల్లో 30 వేల ఓట్లు (కుప్పం నగర పంచాయతీ మినహా) అదనంగా వచ్చాయి. చంద్రబాబు పుట్టి పెరిగిన ఊరు చంద్రగిరిలో చాలా వరకు స్వీప్ చేశాం. బహుశా ఆయన ఇంకో నియోజకవర్గం చూసుకోవాల్సిందే’
--- సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు
నిబంధనల్ని ఎక్కడా అతిక్రమించలేదు
'చంద్రబాబు, ఎస్‌ఈసీ... కోర్టుకు వెళ్లి లిటిగేషన్లు వేసి అధికారులకు మెమోలు ఇప్పించి ఏదో జరిగిపోతోందని సృష్టించారు. మేం ఎక్కడా ఎస్‌ఈసీ నిబంధనలను అతిక్రమించలేదు. పూర్తిగా తెదేపాకు మద్దతుగా వ్యవహరించడాన్నే తప్పుపట్టాం. మా ఎన్నికల ఫలితాలు అభ్యర్థుల ఫొటోలతో వెబ్‌సైట్‌లో ప్రకటిస్తున్నాం. 40% స్థానాలు గెలిచామంటున్న చంద్రబాబు కూడా వెబ్‌సైట్‌లో పెట్టాలి. లేదా మేం ప్రకటించిన వాటిలో ఏవైనా తప్పుంటే చెప్పమనండి. విశాఖ ఉక్కు గురించి జగన్ ఏదీ దాచలేదు. పోస్కో వచ్చిందనే చెప్పారు. అయితే పరిశ్రమలను వేరే చోట ఏర్పాటు చేయమని కోరారు. చంద్రబాబు విశాఖ ఉక్కు గురించి కూడా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు’
--- సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు
ఇదీ చదవండి: పార్లమెంట్ భవనం రెడ్‌స్టోన్‌ను పరిశీలించిన ప్రశాంత్‌రెడ్డి