తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ ఉగ్రరూపం దాల్చుతోంది. 2018 నుంచి 2020 వరకూ మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మంగళవారం రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత మూడేళ్లలో కొత్తగా తెలంగాణలో 1,39,419 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 2,06,677 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో తెలంగాణలో 76,234 (54.67 శాతం) మంది, ఆంధ్రప్రదేశ్‌లో 1,13,190 (54.76 శాతం) మంది మృత్యువాతపడడం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణలో 2018-19లో 1,129.. 2019-20లో 1,156 కేసులు పెరగగా.. ఆంధ్రప్రదేశ్‌లో 2018-19లో 1,513.. 2019-20లో 1,541 కేసులు పెరిగాయి. తెలంగాణలో ఏటా 1100లకుపైగా, ఏపీలో 1500లకుపైగా కేసులు పెరుగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కరోనాతో పోల్చితే క్యాన్సర్ మరణాలు దాదాపు 20 రెట్లు ఎక్కువ సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏటేటా కేసులు, మరణాలు చాప కింద నీరులా పెరుగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చుతున్నారు. గాడితప్పిన జీవనశైలి కారణంగా కేసులు పెద్దఎత్తున నమోదవుతున్నాయని వివరిస్తున్నారు.
30 ఏళ్ల వారినీ వదలని మహమ్మారి
ప్రపంచంలో మరణాలకు దారితీసే అతి ముఖ్య కారణాల్లో గుండెపోటు తర్వాతి స్థానం క్యాన్సర్‌దే. గతంలో 50 ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించేది. ప్రస్తుతం 30 ఏళ్ల వారినీ వెన్నాడుతోంది. 30-40 ఏళ్ల వయసులో ఏటా 10 శాతం కేసులు పెరుగుతుండటం ఆందోళన చెందాల్సిన అంశమే. దీని నివారణకు చర్యలు తీసుకోకుంటే 2025 నాటికి మొదటి స్థానానికి ఎగబాకే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.
ప్రధాన కారణాలు
- సిగరెట్, గుట్కా, తంబాకు వంటి పొగాకు ఉత్పత్తుల వాడకం
- మితిమీరిన మద్యపానం * ఊబకాయం
- వేపుళ్లు, నిల్వ ఆహారం ఎక్కువగా తీసుకోవడం
- వ్యాయామం చేయకపోవడం
- జననావయవాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం
- అధిక ఒత్తిడి * తీవ్ర నిద్రలేమి
- జన్యుపరంగా (ఇది 8-9 శాతం మాత్రమే)
ముందస్తు గుర్తింపుతో చికిత్స సులభం
మన దేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కారక వైరస్ పెళ్లీడుకొచ్చిన మహిళలందరిలోనూ ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో క్యాన్సర్‌గా రూపాంతరం చెందుతుంది. ముందే కనిపెట్టగలిగితే థర్మల్ క్రయోథెరపీ వంటి సులువైన పద్ధతుల్లో నయం చేయొచ్చు. రొమ్ములో క్యాన్సర్ కణితిగా రూపాంతరం చెందడానికి మూణ్నాలుగేళ్లు పడుతుంది. ఈ సమయంలో కనిపెట్టగలిగితే చికిత్స సులువవుతుంది. క్యాన్సర్ లక్షణాలను ముందస్తుగా గుర్తించడం ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన చికిత్సతో పూర్తిగా నయం చేయడానికి అవకాశాలు మెరుగయ్యాయి.
ఆలస్యంతోనే అధిక మరణాలు
హెపటైటిస్ బీ, సీలు కాలేయ క్యాన్సర్లకు, హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ) గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రావడానికి కారణమవుతున్నాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు టీకా అందుబాటులో ఉంది. 8-18 ఏళ్ల వయసు వారికి దీన్ని ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. కాలేయ క్యాన్సర్‌కు హెపటైటిస్ టీకా ఉంది. 40 ఏళ్లు దాటిన మహిళ ఏడాదికోసారి మామోగ్రఫీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి. అత్యధికుల్లో క్యాన్సర్‌ను గుర్తించడమే ఆలస్యమవుతోంది. దాంతో అప్పటికే ముదిరిపోయి మరణాలకు దారితీస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో విస్తృతంగా క్యాన్సర్ ముందస్తు పరీక్షలు నిర్వహిస్తున్నాం.
ఇదీ చూడండి: Dalitha Bandhu: దళితవాడల్లో మౌలిక సదుపాయాలు.. చర్యలకు సీఎం ఆదేశాలు