ప్రతి రోజూ గాల్లోకి 40 రకాల కాలుష్య ఉద్గారాలు విడుదల అవుతుంటాయి. వీటిలో అతి సూక్ష్మ ధూళి కణాలు (పీఎం 2.5), సూక్ష్మ ధూళి కణాలు (పీఎం 10) అత్యంత ప్రమాదకరమైనవి. తల వెంట్రుక మందం 50 ఎంజీల పరిమాణంలో మాత్రమే ఉంటాయి. ఈ లెక్కన పీఎం 10 వెంట్రుక సైజులో ఐదు రెట్లు ఉంటుంది. అదే పీఎం 2.5 విషయానికి వస్తే.. ఇరవై రెట్లు తక్కువగా ఉంటుంది. అందుకే కంటికి కనిపించదు. గాలి పీల్చడమే ఆలస్యంగా నేరుగా ఊపిరితిత్తుల్లో స్థిరపడి శ్వాసకోస సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది.
లాక్డౌన్ తర్వాత
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్ధేశిత పరిమితుల ప్రకారం ఘనపు మీటర్ గాలిలో పీఎం 10 వార్షిక సగటు 60 మైక్రో గ్రాములను దాటరాదు. పీఎం 2.5 తీవ్రత 40 ఎంజీలను మించరాదు. పీఎం 10తో పోల్చితే పీఎం 2.5 మరింత ప్రమాకరం. నగరంలో ఇరవై ముఖ్యమైన ప్రాంతాల్లో పీసీబీ వాయు కాలుష్య నమోదు కేంద్రాలను నిర్వహిస్తుంది. ఆయా కేంద్రాల్లో నమోదైన ఘనాంకాల ఆధారంగా లాక్డౌన్ సడలించిన తర్వాత కాలుష్యం పెరిగిందా.. తగ్గిందా.. అనే విషయమై అధికారులు లెక్కలు తీశారు.
కొన్ని చోట్ల సెంచరీ దాటింది
ఒకటి రెండు మినహా అన్ని ప్రాంతాల్లోనూ పీఎం10 తీవ్రత భారీగా పెరిగింది. కొన్ని చోట్లనైతే ఏకంగా వంద మార్కును దాటేసింది. ఇక పీఎం 2.5 విషయానికి వస్తే.. ఆందోళనకరంగా పెరిగినట్లు ఘనాంకాలు స్పష్టం చేస్తున్నాయి. హెచ్సీయూ దగ్గర ఆగస్టులో 16 ఎంజీలు ఉండగా అక్టోబర్ 40 ఎంజీలకు పెరిగింది. సనత్నగర్లో 15 ఎంజీల నుంచి 54 ఎంజీలకు పెరిగింది. జూపార్క్ వద్ద 17 ఎంజీల నుంచి 63 ఎంజీలకు చేరింది.
ఎక్కువ మంది నగరవాసులు వ్యక్తిగత వాహనాల వినియోగానికే మొగ్గుచూపారు. దీనికి తోడు ఇటీవల కురిసన భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో రోడ్లు అధ్వాన్నస్థితికి చేరాయి. ఇంకేముంది ఆయా ప్రాంతాల్లో దుమ్ము దులిపింది. ఫలితంగా పీఎం 2.5, పీఎం 10 తీవ్రత భారీగా పెరిగినట్లు పర్యావరణ వేత్తలు స్పష్టం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో శీతాకాలం వాయు కాలుష్యం మరింత పెరిగే అవకాశముందని కాలుష్య నియంత్రణ అధికారులు హెచ్చరిస్తున్నారు.
- ఇవీ చూడండి: 'తెలంగాణ మహిళా పోలీసులు దేశానికే ఆదర్శం'