REVANTH REDDY: పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక పట్టించుకోవట్లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పోడు భూముల్లో దుక్కి దున్ని.. సాగు చేసుకుంటున్న వారిని పోలీసులు అరెస్టులు చేసి హింసిస్తున్నారని ఆరోపించారు. తెరాస ప్రభుత్వం ఆదివాసీలను చిన్నచూపు చూస్తోందన్నారు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, కర్కంగూడ జడ్పీటీసీ కాంతారావులు పార్టీలో చేరగా.. రేవంత్‌రెడ్డి వారికి కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. వెంకటేశ్వర్లు, కాంతారావుల చేరికతో కాంగ్రెస్ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే 11 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 స్థానాలనూ కాంగ్రెస్ గెలుచుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ అమలైతే.. అన్నదాతల జీవితాలే మారిపోతాయని పేర్కొన్నారు. అధికారం చేపట్టాక పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. తొందరలోనే అశ్వారావుపేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్న రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌లోకి చేరికల తుపాన్ రాబోతోందని స్పష్టం చేశారు.
పోడు భూములకు పట్టాలిస్తానని ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్.. ఆ హామీని పట్టించుకోవడం లేదు. వందల మంది ఆదివాసీలపై తెరాస ప్రభుత్వం కేసులు పెట్టింది. గిరిజనుల భూములు లాక్కుని లే అవుట్లు చేస్తున్నారు. తాటి వెంకటేశ్వర్లు, కాంతారావుల చేరికతో కాంగ్రెస్ మరింత బలపడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు పార్లమెంట్ సీట్లతో పాటు మొత్తం అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్‌వే. 11 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుంది. తొందరలోనే కాంగ్రెస్‌లోకి చేరికల తుపాన్ రాబోతుంది.-రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్
ఇవీ చూడండి..
మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే వారికి న్యాయం: తాటి వెంకటేశ్వర్లు
మోదీ కోసం రూ.23కోట్లతో రోడ్లు.. ఒక్క వానతో ఫసక్.. రాష్ట్రంపై పీఎంఓ సీరియస్!