అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ప్రవేశ పెట్టారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వాసులకు న్యాయం జరగలేదని ఎమ్మెల్యే రమేశ్ అన్నారు. గతంలో నెలకు రూ.200 పెన్షన్ ఇవ్వగా తాము రూ.2వేలకు పెంచామని రమేశ్ తెలిపారు. గురుకుల, సంక్షేమ పాఠశాలల్లో వసతులు అభివృద్ధి చెందాయని ఆయన పేర్కొన్నారు.
నిరుపేద కుటుంబాలకు అండ...
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లతో నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. రైతులకు 24గంటల విద్యుత్ సరఫరా తెరాస హయాంలోనే జరుగుతోందని వివరించారు. వ్యవసాయం దండగా అన్నమాట నుంచి వ్యవసాయం పండగ దిశకు తెరాస తీసుకెళ్తోందన్నారు. కేంద్రం నుంచి ఆర్థికసాయం అంతంతమాత్రంగానే ఉన్నా సంక్షేమ పథకాలను మాత్రం నిలిపేయలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
అన్ని వర్గాలకు అవకాశాలు !!
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని శాసన సభ్యుడు వివేక్ బలపరిచారు. తెలంగాణలో వనరులపై సీఎం కేసీఆర్‌కి సంపూర్ణ అవగాహన ఉందని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడోస్థానం దక్కించుకుందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ఫలాలు రాష్ట్రంలో అన్ని వర్గాలకు అందుతున్నాయని ఎమ్మెల్యే వివేక్ స్పష్టం చేశారు.