పంటలకు సాగునీరు.. ప్రజలకు తాగునీరు అందించే సాగునీటి ప్రాజెక్టులు సమస్యల నడుమ ప్రమాదకరంగా మారాయి. నిర్వహణ, మరమ్మతులు సకాలంలో చేపట్టకపోవడం..నిర్దిష్ట కాలంలో నిధులు విడుదలకాకపోవడంతో జలాశయాలు తీసికట్టుగా మారుతున్నాయి. ప్రధానంగా కృష్ణానదిపై ఉన్న ఇందిరా ప్రియదర్శిని జూరాల, నాగార్జునసాగర్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కోయిల్‌సాగర్ నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది.
వరద సమయంలో ఎక్కడ లీకేజీ ఏర్పడుతుందో.. స్పిల్‌వేపై ఏ మేరకు గుంతలు పడతాయోనన్న భయం ఇంజినీర్లను వెంటాడుతోంది. డ్యాం భద్రత కోసం చేపట్టాల్సిన వార్షిక నిర్వహణను కొద్దిపాటి నిధులతో మమ అనిపిస్తున్నారు. లోపాల కారణంగా రెండేళ్ల కాలంలో కడెం, మూసీ గేట్లు కొట్టుకుపోగా..సరళాసాగర్ కట్ట తెగిపోయి నీరు వృథా అయింది. పలు జలాశయాల గేట్లకు లీకేజీలు ఏర్పడ్డాయి. ఇప్పటికే కృష్ణా నదిలో ప్రవాహం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జలాశయాల స్థితిగతులపై కథనం.
లోపం ఏర్పడ్డాకే మరమ్మతులా?
డ్యాంల పరిరక్షణకు ప్రత్యేక విధివిధానాలున్నా, సరిగా అమలు కావడంలేదు. ఏటా జలాశయాలను సందర్శించి భద్రత కమిటీ ఇచ్చే సూచనలు పాటించట్లేదు. జలాశయాలు, ఆనకట్టలు, కాల్వల మరమ్మతులు, వార్షిక నిర్వహణ ఎప్పటికప్పుడు జరగాల్సిన ప్రక్రియ. నదుల్లో ప్రవాహం తగ్గిపోయాక డిసెంబరు నుంచి మే నెల వరకు మరమ్మతులు చేపట్టేందుకు అనుకూల కాలం. ఏటా సాధారణ నిర్వహణలో భాగంగా క్రస్టుగేట్లు, ఇనుప తాళ్లకు ఆయిలింగ్, నీటి లీకేజీని నియంత్రించే రబ్బరు సీళ్లు, విద్యుత్తు మోటార్లు, లిఫ్టులను సరిచేయడం, మరమ్మతుల లాంటివి ప్రాజెక్టులకు నీళ్లు వచ్చే సమయానికి పూర్తవుతున్నాయి. సకాలంలో నిధులు విడుదల కాకపోవడం, అవసరమైన పరికరాలు, సామగ్రి కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యమే దీనికి కారణం. ఈ సమస్య పరిష్కారానికి ఈ ఏడాది ప్రభుత్వం ఆపరేషన్, మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఒక ఇంజినీర్ ఇన్ చీఫ్‌ను కూడా నియమించి నిధులు కేటాయించింది. ఈ పునర్ వ్యవస్థీకరణకు ఇటీవలే మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
గేట్ల తుప్పు వదిలించేదెప్పుడో?
రాష్ట్రంలో కృష్ణానది ప్రవేశించాక ఆ భారీ ప్రవాహాన్ని తట్టుకుని నిలబడే మొదటి జలాశయం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల. నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు. ఇప్పటికే ఈ జలాశయం పూర్తిస్థాయిలో నిండింది. ఎగువ నుంచి వరద వస్తోంది. ఏటా లక్షల క్యూసెక్కుల నీళ్లు ఇక్కడి నుంచి దిగువకు ప్రవహిస్తాయి. కనిష్ఠంగా వెయ్యి టీఎంసీల నీళ్లు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. ప్రాజెక్టు గేట్లకు 1997 తరువాత పూర్తిస్థాయిలో మరమ్మతు చేయలేదు. 64 గేట్లలో సగానికిపైగా తుప్పుపట్టి కనిపిస్తున్నాయి. ఎడమ ప్రధాన కాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద కొన్ని రాళ్లు ఊడిపోగా ఇటీవల మరమ్మతులు చేపట్టారు. రెండేళ్ల క్రితం ఈ ప్రాజెక్టు మరమ్మతు ప్రతిపాదనల కోసం రెండు కమిటీలను వేయగా అవి రూ.12.50 కోట్లు అవసరమని తేల్చాయి. ఆ నిధులు నేటికీ విడుదల కాలేదు. గేట్లు అదే దుస్థితిలో ఉన్నాయి.
ఏడు నెలలు సాగిన లీకేజీ
నల్గొండ జిల్లాలో నిర్మితమైన నాగార్జునసాగర్ జలాశయం నిర్వహణ దాని స్థాయికి తగినట్లు లేదు. 312.05 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు పరిరక్షణకు ఎంతో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా నిధుల మంజూరులో జాప్యం కొనసాగుతోంది. 2009లో వచ్చిన భారీ ప్రవాహానికి స్పిల్‌వేపై గుంతలు ఏర్పడగా తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టారు. అనంతర కాలంలో వచ్చిన వరదలకు మళ్లీ గోతులు పడ్డాయి. భారీ వరదలు వస్తే ఎటువంటి ప్రమాదం ముంచుకు వస్తుందోనని సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ డ్యాం పూర్తి స్థాయి మరమ్మతులకు దాదాపు రూ.40 కోట్లు కావాలని అంచనా. ఇంజినీర్లు ఏటా పంపుతున్న ప్రతిపాదనల్లో సగం నిధులు కూడా రాక... మరమ్మతులు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. గత ఏడాది సెప్టెంబరులో కుడి ప్రధాన కాల్వ హెడ్‌రెగ్యులేటర్‌కు సంబంధించిన ఒక గేటు తలుపు విరిగిపోయింది. అందులోంచి ఏడు నెలల పాటు నీళ్లు లీకయ్యాయి. ఇటీవలే తాత్కాలిక గేటు బిగించారు. వార్షిక నిర్వహణలో భాగంగా గ్రీజు, ఇతర మరమ్మతులు మాత్రం నిర్వహిస్తున్నారు.
జూరాల నుంచి ఎత్తిపోశాక, 2.36 టీఎంసీల నీటిని నిల్వ చేసే కోయిల్‌సాగర్ జలాశయం సాగు, తాగునీటికి ప్రధానమైన వనరు. మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలంలో ఉన్న ఈ జలాశయం నిర్వహణ కూడా అంతంతే. గత ఏడాది వచ్చిన వరదలకు స్పిల్‌వే దిగువన గోతులు పడ్డాయి. కుడి కాల్వ పలు చోట్ల భారీగా ధ్వంసమైంది. రెండేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. పలు చోట్ల తూముల తలుపులు విరిగిపోయాయి.
ఇదీ చదవండి: KTR: తెలంగాణలో ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతోంది