ధరణి పోర్టల్ పాక్షికంగా అందుబాటులోకి వచ్చింది. పోర్టల్ ద్వారా ప్రస్తుతం భూముల లావాదేవీలు జరగనప్పటికీ పాక్షికంగా అందుబాటులోకి వచ్చింది. ధరణిలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలు విడివిడిగా జరిపేలా ఏర్పాటు చేశారు. ప్రజలు రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్‌చేసుకోవడం, భూముల వివరాలు తెలుసుకోవడం, నిషేధిత భూముల వివరాలు, ఎంకంబరెన్స్ వివరాలతో పాటు స్టాంపు డ్యూటీ చెల్లింపు కోసం మార్కెట్ విలువ తెలుసుకోవడం లాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. పట్టాదారు పాసుపుస్తకం లేదా సర్వే నంబర్ల వివరాల ఆధారంగా వ్యవసాయ ఆస్తులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. ఆస్తిపన్నుసంఖ్య లేదా ఇంటి నంబర్ ఆధారంగా వ్యవసాయేతర ఆస్తుల సమాచారం, వివరాలను తెలుసుకోవచ్చు. పోర్టల్ ప్రారంభం కానందున కేవలం పాక్షికంగా మాత్రమే అందుబాటులో ఉంది.
తహసీల్దార్లు తమకు ఇచ్చిన అధికారిక లాగిన్‌ఐడీల ద్వారా ధరణి పోర్టల్లో భూముల లావాదేవీలు చేసే అవకాశాన్ని కల్పించారు. ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే సాంకేతిక సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి సర్వర్ సమస్యలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు చేయలేకపోతున్నామని, చాలా సమయం పడుతోందని పలువురు తహసీల్దార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను పరిష్కరించి ధరణిని ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. పోర్టల్ ప్రారంభానికి ఈ నెల 29వ తేదీని ముఖ్యమంత్రి కేసీఆర్ ముహూర్తంగా నిర్ణయించిన నేపథ్యంలో ఆలోగా ధరణిని పూర్తిస్థాయిలో సిద్ధం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి: దసరా వేళ బస్సులు లేక ప్రయాణికులు ఇక్కట్లు