Rains In Telangana: రాష్ట్రంలో కుండపోత వర్షాలు జనజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. దాంతో రాకపోకలు స్తంభించాయి. పలు పట్టణాల్లో కాలనీలు నీట మునిగాయి. పంటపొలాలు దెబ్బతిన్నాయి. పాత ఇళ్ల గోడలు కూలి నలుగురు మరణించారు. జాతీయ రహదారిపై వరదప్రవాహన్ని ద్విచక్రవాహనంపై దాటేందుకు యత్నించిన ఓ యువకుడు కన్నుమూశాడు. ఒకరు గల్లంతయ్యారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతూ తగ్గుతూ వస్తోంది.
కొద్ది గంటల్లోనే..
వాతావరణంలో మార్పుల కారణంగా అకస్మాత్తుగా అప్పటికప్పుడు కారుమేఘాలేర్పడి కొద్దిగంటల వ్యవధిలోనే కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ శనివారం ప్రకటించింది. శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకూ పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. అత్యధికంగా మెదక్ జిల్లా పాతూరులో 26.8, రాజ్‌పల్లిలో 24, చేగుంటలో 23.4, మెదక్‌లో 21.5, శివ్వంపేటలో 21.4 నాగపూర్‌లో 20.1, దేవరుప్పుల (జనగామ)లో 25.5, వెంకటాపురం (ములుగు)లో 23.5, దంతాలపల్లి (మహబూబాబాద్)లో 22.2, జిన్నారం (సంగారెడ్డి)లో 21.4, కొత్తగూడెం (భద్రాద్రి)లో 20 సెం.మీ.ల వర్షం కురిసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్ జగిత్యాల, జనగామ జిల్లాల్లో ఓమోస్తరు వర్షాలు కురిశాయి.
ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలోకి నీరు
ఉమ్మడి మెదక్ జిల్లాలో పలుచోట్ల కుంభవృష్టి కురిసింది, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో చాలా చోట్ల రహదారులు, వంతెనలను వరద ముంచెత్తింది. హల్దీ, కూడవెళ్లి, నల్లవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలోకి కూడా నీరు చేరింది. మనోహరాబాద్ మండలం రామాయపల్లి రైల్వేవంతెన కింద భారీగా వరద నీరు చేరింది. దీంతో జాతీయరహదారి 44పై దాదాపు నాలుగుగంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మెదక్‌లోని ఆటోనగర్, వెంకట్రావుకాలనీల్లోకి వరద వచ్చి చేరింది. మహబూబ్‌నహర్ కాలువ నుంచి ఇటువైపు నీళ్లు రావడంతో ఆటోనగర్‌లోని చాలా దుకాణాలు జలమయ్యాయి.
22 మందిని రక్షించిన ఎన్‌డీఆర్‌ఎఫ్
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపూర్- మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రాంపురం మధ్యలో బొత్తలపాలెం వద్ద పాలేరు వాగులో చిక్కుకున్న 22 మంది కూలీలను పోలీసులు, రెవెన్యూ, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది శనివారం ఉదయం క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శెట్లూర్‌కు చెందిన గైని శ్రీనివాస్ వ్యవసాయ పనులకోసం మంజీరనది దాటి కుర్తం గడ్డలో చిక్కుకుపోగా అధికారులు గజ ఈతగాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు.
కొట్టుకుపోయిన జాతీయరహదారి అప్రోచ్‌రోడ్డు
తాడ్వాయి, న్యూస్‌టుడే: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి 163వ జాతీయరహదారి ధ్వంసమైంది. జలగలాంచవాగు ప్రవాహ ఉద్ధృతికి వంతెన ధ్వంసం కాగా 30 మీటర్ల మేర అప్రోచ్‌రోడ్డు కొట్టుకుపోయింది. హనుమకొండ-ఏటూరునాగారం మధ్య రాకపోకలు స్తంభించాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు యంత్రాల సాయంతో శనివారం సాయంత్రానికి మరమ్మతులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించారు.
గురుకులంలోకి వరద.. విద్యార్థుల తరలింపు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం పోచాపూర్ గిరిజన సంక్షేమశాఖ బాలికల మినీ గురుకులంలోకి వరద చేరడంతో అధికారులు విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మధ్యలో కిన్నెరసాని వాగు ఉండగా అధికారులు విద్యార్థులను ఎత్తుకొని తీసుకొచ్చారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..
ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు, ఆకేరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఖమ్మం గ్రామీణం మండలం తీర్థాల వంతెనపై నుంచి ఆకేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గోళ్లపాడు-తీర్థాల మధ్య రాకపోకలు నిలిపేశారు. మున్నేరు ఉద్ధృతికి తీర్థాల ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన రెండు భవనాల్లో ఒకటి కూలిపోయింది. ఖమ్మం-సూర్యాపేట ప్రధాన రహదారిపై నుంచి వరద ప్రవహిస్తోంది. భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలం మర్కోడు సమీపంలో పాలవాగు ఉద్ధృతికి ట్రాక్టర్ కొట్టుకుపోయింది. వాగులో నీటి ప్రవాహం తగ్గిన తర్వాత మరో వాహనంతో బయటకు తీశారు.
గోదావరికి మళ్లీ వరద: భద్రాచలం వద్ద శుక్రవారం వరకు తగ్గుతూ వచ్చిన గోదావరి నీటిమట్టం మళ్లీ పెరిగి తర్వాత తగ్గుతూ వస్తోంది. శుక్రవారం రాత్రి 10 గంటలకు 42 అడుగులకు తగ్గిన గోదావరి తర్వాత పెరిగింది. శనివారం ఉదయం 8 గంటలకు 45.6 అడుగులకు చేరుకుంది. మధ్యాహ్నం వరకు నిలకడగా ఉన్న నీటిమట్టం తర్వాత తగ్గుముఖం పడుతూ రాత్రి 7 గంటలకు 44.5 అడుగుల వద్ద నిలకడగా కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోనూ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కడెంతోపాటు ఎల్లంపల్లి, స్వర్ణ, కుమురంభీం, మత్తడివాగు, సాత్నాల జలాశయాల్లోకి వరద రావడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలోనూ వర్షాలతో కొన్ని కాలనీల్లో నీరు చేరి ప్రజలు అవస్థలు పడ్డారు.
గోడకూలి ఇద్దరి మృతి
మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి శ్రీలక్ష్మి గణేష్ మినరల్స్ కంపెనీలో రేకుల గదిలో కార్మికులు నివసిస్తున్నారు. అర్ధరాత్రి దాటాక భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా గోడ కూలిపోయింది. గదిలో నిద్రిస్తున్న బిహార్‌కు చెందిన రాజ్‌బెన్ యాదవ్ (30), బికారి యాదవ్ (45)లు అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
వైద్య పరీక్షలకు వెళుతూ..
మోటార్ సైకిల్‌పై వెళ్తూ జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వరదనీటిని దాటబోయి నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాగేపూర్‌కు చెందిన తోకల సాయిలు (19) అసువులు బాశాడు. విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన వైద్యపరీక్షల కోసం ఏజెంట్ హరుణ్‌తో హైదరాబాద్ వెళ్తుండగా మెదక్ జిల్లా నార్సింగి దాటగానే జాతీయ రహదారి 44పై భారీగా వరద నీరు వచ్చింది.దాంతో ఒక్కసారిగా వాహనం అదుపుతప్పింది. దీంతో వెనకాల కూర్చున్న సాయిలు తల బలంగా డివైడర్‌కు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. హరుణ్ క్షేమంగా బయటపడ్డారు.
నిశ్చితార్థానికి వచ్చి..
వర్షాల కారణంగా శుక్రవారం అర్ధరాత్రి 2 గంటలకు వరంగల్ మండి బజార్‌లో పాత భవనం కూలి పక్కనున్న గుడిసెపై పడటంతో తిప్పారపు పైడయ్య (55), ఫిరోజ్ (24)లు మృతిచెందారు. వరంగల్ ఉర్సు ప్రాంతానికి చెందిన యువతితో ఆదివారం నిశ్చితార్థం జరగాల్సిన ఫిరోజ్ ఖమ్మం నుంచి వచ్చి ఇలా మృత్యువాత పడటం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇదీ చదవండి: 'ఇది మనకు పరీక్షాసమయం.. ప్రజలను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండాలి..'