Raghunandan Rao Comments on Telangana bjp president : తెలంగాణ బీజేపీలో అసంతృప్తి సెగలు బయటపడుతున్నాయి. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదని మార్పు ఉంటుందని వార్తలు వస్తున్న తరుణంలో రఘునందన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంజయ్ పదవి మార్పుపై వచ్చే వార్తలన్నీ నిజాలేనని పేర్కొన్నారు. అంతే కాకుండా బీజేపీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అర్హుడిని కాదా? అని ప్రశ్నించిన ఆయన.. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్‌లో ఏదో ఒకటి ఇవ్వాలని కోరారు.
మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వాలని రఘునందన్ విజ్ఞప్తి చేశారు. జాతీయ అధికార ప్రతినిధి ఇచ్చినా సరిపెట్టుకుంటానని చెప్పుకొచ్చారు. పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నానని గుర్తు చేసుకున్న ఆయన.. కొన్ని విషయాల్లో తన కులమే తనకు శాపం కావచ్చునని అభిప్రాయపడ్డారు. దుబ్బాక ఎన్నికల్లో తనకెవరూ సాయంచేయలేదని గుర్తు చేసుకున్న రఘునందన్.. రెండోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో తనను చూసే గెలిపించారని విశ్వాసం వ్యక్తం చేశారు. తాను బీజేపీలోనే ఉంటానని ప్రకటించారు. రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
సంజయ్‌ది స్వయంకృతాపరాథం : వంద కోట్లు ఖర్చు పెట్టినా మునుగోడులో బీజేపీ అభ్యర్థి గెలవలేదని రఘునందన్ విమర్శించారు. బండి సంజయ్‌ది స్వయంకృతాపరాథమని ఆరోపించారు. పుస్తెలమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన బండి సంజయ్.. వంద కోట్లతో యాడ్స్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. జాతీయ నేతలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ బొమ్మలతో ఓట్లు రావని విమర్శించారు. రఘునందన్, ఈటల బొమ్మలతోనే ఓట్లు వస్తాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ గుర్తు చివరి అంశమేనని అభిప్రాయపడ్డారు. పార్టీకి శాసనసభాపక్షనేత లేడని విషయం నడ్డాకు తెలియదని అన్నారు. తాను గెలిచినందుకే ఈటల పార్టీలోకి వచ్చారని పేర్కొన్న రఘునందన్.. పదేళ్లలో పార్టీ కోసం తన కంటే ఎక్కువ ఎవరూ కష్టపడలేదని అన్నారు. సేవకు ప్రతిఫలం లేకుంటే జేపీ నడ్డాపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు.
ఇవీ చదవండి: