హైదరాబాద్ నగరంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో విద్యాసంస్థలు మూతపడినా.. మిగతావాటిపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు. కొవిడ్ నిబంధనలతో రద్దీ ప్రదేశాల్లో ప్రజలు తిరగాలని పలు సూచనలు జారీ చేసింది. మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే రూ. 1000 జరిమానా విధించాలని తీర్మానించింది.
నిబంధనలు గాలికొదిలి..
కానీ ఈ నిబంధనలను తుంగలో తొక్కి ప్రజలు బయట సంచరిస్తున్నారు. ఏ మాత్రం జాగ్రత్తలు పాటించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. ఇటువంటి నిర్లక్ష్యం సినిమా థియేటర్లలో కొట్టొచ్చినట్లుగా కనబడుతోంది.
థియేటర్లలో కలకలం..
ఎర్రగడ్డ, మూసాపేట, బోరబండ ప్రాంతాల్లో ఉన్న థియేటర్ల వద్ద ప్రేక్షకులు ఎవరూ కనిపించలేదు. అయితే మూసాపేటలోని లక్ష్మీకళ థియేటర్ వద్ద కొంతమంది ప్రేక్షకులు మాస్కులు ధరించకుండా సినిమాకు వచ్చారు. మరికొందరు క్యూలో భౌతిక దూరం పాటించడం లేదు. కొంతమంది మాస్కులు ధరించకుండా గుమిగూడటం చూస్తే నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేలా అక్కడ పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. కానీ ఇబ్రహీంపట్నంలోని సంతోష్ థియేటర్ వద్ద సాధారణ పరిస్థితి కనిపిస్తోంది. రద్దీ ఎక్కువ లేదు. వచ్చిన వారు మాస్కులు ధరించి కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు.
ఇదీ చదవండి: 'ఆదుకునే నాథులు లేరు... చికిత్స ఎలా చేయించాలో తెలియదు'