Protest of PET candidates in front of TSPSC office: హైకోర్టు ఉత్తర్వులు అనుసరించి 2017 గురుకుల పీఈటీ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీఈటీ అభ్యర్థుల సంఘం హైదరాబాద్లో ఆందోళనకు దిగింది. వివిధ జిల్లాల నుంచి పిల్లలతో సహా తరలి వచ్చిన అభ్యర్థులు నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. టీఎస్పీఎస్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కమిషన్ చైర్మన్ ఉద్దేశపూర్వకంగానే ఫలితాలు ప్రకటించకుండా పీఈటీ అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటుందని సంఘం అధ్యక్షుడు సదానంద్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ ప్రకటనలు ఇస్తూ.. ఫలితాలు ప్రకటించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఫలితాలు వెల్లడించక పోవడంతో మనస్తాపానికి గురై.. ఎనిమిది మంది పీఈటీ అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
2017లో 616 గురుకుల పీఈటీ పోస్టుకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టుల విషయంలో కోర్టులో కేసు వేశారు. అయితే ఆ కేసు ముగిసిపోయిన ఇప్పటి వరకు ప్రభుత్వం ఫలితాలను వెల్లడించలేదని అన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా టీఎస్‌పీఎస్సీ జాప్యం చేస్తోందని అన్నారు. గత ఆరేళ్లుగా పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈ గురుకుల పీఈటీ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్తో డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వారు, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వారందరికీ అవకాశం కల్పించి ఒకే పరీక్ష నిర్వహించారని తెలిపారు. 616 పోస్టులకుగానూ 1:2 ప్రాతిపదికన 1232 మంది అభ్యర్థులను గతంలో ఎంపిక అయ్యారని చెప్పారు. ఇంత వరకు వీటి వివరాలను వెబ్సైట్లో పెట్టలేదన్నారు. అభ్యర్థులకు రోజురోజుకూ కుటుంబ పోషణ భారం అవుతోందని.. ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని ఫలితాలు ప్రకటించాలని కోరారు. లేని పక్షంలో అభ్యర్థులతో కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.
"2017లో 616 గురుకుల పీఈటీ పోస్టుకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టులకు కోర్టు కేసు ముగిసిపోయిన నియామక ప్రక్రియ చేపట్టలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పుకి విరుద్దంగా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ వ్యవహరిస్తున్నారు. హైకోర్టు తీర్పు వచ్చి రెండు నెలలు అవుతుంది. అసలు పోస్టులు ఉన్నాయా లేక వేరే అభ్యర్థులకి అమ్మేశారా అన్న విషయం ఛైర్మన్ చెప్పాలి. ప్రకటించిన ఫలితాల్లో మార్కులు పెట్టకుండా వెల్లడించారు. దీనివలన ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలియడం లేదు. వెబ్ వివరాలు స్పష్టంగా తెలియజేసే వరకు నిరసన చేపడతాం." -సదానంద్ గౌడ్, పీఈటీ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు
ఇవీ చదవండి: