బడ్జెట్ కేటాయింపులను పరిశీలిస్తే చాలా రంగాల్లో నిరాశ కలిగించిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. 2014-15లో రూ.9,500 కోట్ల అప్పుల నుంచి 2017-18 వరకు రూ.49 వేల కోట్ల అప్పు పెరిగిందని... ఈ సారి దాదాపు రూ. 35 వేల కోట్లు అప్పు చేసే అవకాశం ఉందని తెలిపారు. వడ్డీల శాతం ఎక్కువైందని... 33 శాఖలకు భారీగా కోతలు విధించారని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం నిరాశ కలిగించిందన్నారు.
గతంలో కేటాయించిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్లో 50 శాతమైనా ఖర్చు చేయలేదని... ఎంబీసీకి రూ. వెయ్యి కోట్లు కేటాయించి రూపాయి ఖర్చు చేయలేదని... ఈ సారి కేటాయించిన రూ.500 కోట్లు అయినా ఖర్చు చేస్తారనే నమ్మకం లేదని చెప్పారు. రుణమాఫీపై రైతులు, రైతు సంఘాలు ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం వృద్ధిరేటు పడిపోయిందని... ఈ సారి సైతం సంక్షేమ పథకాల్లో భారీగా కోత పడే ప్రమాదం ఉందని కోదండరాం తెలిపారు.
ఇదీ చూడండి : తెలంగాణ బడ్జెట్.. రూ.1,82,914 కోట్లు