డ్రైవర్‌గా రాత్రి, పగలూ తేడా లేకుండా పని చేశాను. సెలవులు మిగుల్చుకుంటే ఉద్యోగ విరమణ సమయంలో కాస్త డబ్బులు చూడొచ్చు అనుకున్నాను. నాకు రూ.5.19 లక్షలు రావాల్సి ఉంది. రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తున్నాను. డ్రైవర్ వృత్తిలో ఉండడం వల్ల.. రక్తపోటుతోపాటు మధుమేహంతో ఇబ్బంది పడుతున్నా. ప్రతి నెలా వైద్య ఖర్చులకు డబ్బులు సరిపడక అవస్థలు పడుతున్నాను. కుటుంబ పింఛను రూ. 3000తో పాటు.. స్టాఫ్ రిటైర్‌మెంట్ బెనిఫిట్ స్కీమ్ (ఎస్‌ఆర్‌బీఎస్) కింద రూ. 3100 అందుతోంది. పింఛను ఉండదు. ఇది కనీస అవసరాలకు కూడా సరిపోవడంలేదు.
- మధుసూదన్ రెడ్డి, దిల్‌సుఖ్‌నగర్
2018 ఏప్రిల్ నుంచి ఉద్యోగ విరమణ చేసిన వారికి తర్వాత అందాల్సిన ప్రయోజనాలు అందక ఉసూరుమంటున్నారు. ఇలా అవస్థలు పడుతున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా 2650 మంది ఉన్నారు. చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బుల్లేక ఇప్పటికే కొంతమంది మృతి చెందారు. ఇప్పటికైనా రావలసిన మొత్తాలను ఇవ్వాలని వారి కుటుంబసభ్యులు కోరుతున్నారు.
రూ. 65 కోట్ల బకాయిలు..
‘ఉద్యోగం చేసినప్పుడు సెలవులు అనవసరంగా వాడేయకండి. ఈ రోజు నీవు మిగుల్చుకున్న సెలవు.. రేపటికి మదుపు. ఈ రోజు మీ నెల జీతం తక్కువ ఉండవచ్చు. దీంతో పని లేకుండా.. ఉద్యోగ విరమణ చేసినప్పుడు మీ జీతాన్ని బట్టి.. మీరు పొదుపు చేసిన సెలవులకు లెక్కలు కట్టి యాజమాన్యం డబ్బులు ఇస్తుంది’ అంటూ కరపత్రాలు విడుదల చేసి ఉద్యోగుల్లో చైతన్యం నింపారు అధికారులు. పీఎఫ్ కార్యాలయం నుంచి కుటుంబ పింఛను పథకం కింద రూ. 3 వేల వరకు అందుతుంది. అలాగే స్టాఫ్ రిటైర్‌మెంట్ బెనిఫిట్ స్కీమ్ (ఎస్‌ఆర్‌బీఎస్) పథకం కింద రూ. 2 వేల వరకు అందుతుంది తప్ప.. మరేమీ అందదు. మిగుల్చుకున్న సెలవుల డబ్బులు ఎంతో ఉపయోగపడతాయని భావించి చాలామంది సెలవులు పెట్టకుండా సేవలందించారు. ఆ డబ్బులు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత అందకపోవడంతో మూడేళ్లుగా ఆందోళన చెందుతున్నారు. ఒక్కో ఉద్యోగికి రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల చొప్పున మొత్తం రూ. 65 కోట్లు రావాల్సి ఉంది.
ఈ ఏడాది డిసెంబరు నుంచి మళ్లీ విరమణలు
ఉద్యోగ విరమణ వయసును రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందుగానే ఆర్టీసీ పెంచింది. 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు 2019 డిసెంబరు నెలలో పెంచింది. దీంతో 2021 డిసెంబరు వరకూ ఆర్టీసీలో ఉద్యోగ విరమణలు లేవు. ఆ తర్వాత ఇప్పటికే ఉన్న 2,650 మందికి ప్రతి నెలా 120 మంది వరకూ ఉద్యోగ విరమణ చేసిన వారు తోడవుతారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు విరమణ చేసిన రోజే అందాల్సిన ప్రయోజనాలన్నిటినీ లెక్కలు కట్టి ముట్టచెబుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులు వాపోతున్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన రోజే అన్ని ప్రయోజనాలు ఇచ్చేస్తున్నారని వారంటున్నారు. రాష్ట్రంలోనూ ఆ విధానాన్ని అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి అందజేస్తున్న ఆర్థిక సాయాన్ని జీతాల చెల్లింపులకే సరిపెట్టకుండా.. తమ బకాయిలన్నింటినీ వెంటనే ఇచ్చేలా మార్గదర్శనం చేయాలని పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: సాగర్ ఉపఎన్నిక: భాజపా ప్రచార తారల జాబితా విడుదల