Inter Private Colleges List in Telangana : వచ్చే విద్యా సంవత్సరానికి(2023-24) సంబంధించి రాష్ట్రంలో అనుమతులు పొందిన ప్రైవేట్ జూనియర్ కళాశాలల జాబితాను ఏప్రిల్ 30నాటికి వెల్లడిస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది. అందుకు అఫిలియేషన్ కోసం ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్ ద్వారా బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ సోమవారం కాలపట్టికను విడుదల చేశారు.
Private Junior Colleges List in Telangana :ఆలస్య రుసుం లేకుండా ఫిబ్రవరి 21 వరకు, ఆ తర్వాత దశల వారీగా రూ.20 వేల ఆలస్య రుసుంతో మార్చి 31వరకు కళాశాలలు దరఖాస్తు చేసుకోవచ్చు. అనుబంధ గుర్తింపు పొందిన కళాశాలల జాబితాను ఏప్రిల్ 30 నాటికి వెబ్‌సైట్లో పొందుపరుస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అనుమతులు ఉన్న కళాశాలల జాబితా తెలియడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నష్టపోకుండా ఉంటారని బోర్డు తెలిపింది. ఈసారి కూడా ఒక మండలం నుంచి మరో మండలానికి, జిల్లాకు ఆయా కళాశాలలను తరలించడానికి (నాన్ లోకల్ షిఫ్టింగ్) దరఖాస్తులను స్వీకరించరు. మండల పరిధిలో మాత్రం తగిన ఫీజు చెల్లించి తరలించుకోవచ్చు.
జీఎస్టీ, హరిత నిధి చెల్లించాల్సిందే.. అనుబంధ గుర్తింపు ఇవ్వడం అనేది సేవ కిందకు వస్తుందని, అందువల్ల అఫిలియేషన్ ఫీజుపై జీఎస్టీ 18 శాతం చెల్లించాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. ఈ రకంగా రుసుంపై జీఎస్టీ విధించడం ఇదే తొలిసారి. అంతేకాకుండా గత ఏడాది ఫిబ్రవరి 18న ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో 17 ప్రకారం ఆయా కళాశాలలు హరిత నిధిని చెల్లించాలని కూడా బోర్డు పేర్కొంది.
ఆ ప్రకారం గ్రామ పంచాయతీల్లోని కళాశాలలు రూ.500, మున్సిపాలిటీ- రూ.వెయ్యి, కార్పొరేషన్, జీహెచ్‌ఎంసీ పరిధిలోని కళాశాలలు రూ.1500 చొప్పున చెల్లించాలి. అయితే జీఎస్టీని విరమించుకోవాలని ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీసతీష్ డిమాండ్ చేశారు. ఇప్పటికే విద్యార్థుల నుంచి హరిత నిధిని వసూలు చేస్తున్నారని, మళ్లీ కళాశాలలపై ఎందుకు విధిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.