ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ, వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యంపై... ప్రైవేటు ఆస్పత్రుల బాధిత సంఘం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. కరోనా పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు లేఖను అందించారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునేందుకు ఎంతోమంది ఆస్తులు, పుస్తెలు అమ్ముకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నామమాత్రపు చర్యలు
ఆస్పత్రుల బిల్లుల విషయంలో కోర్టులు ప్రభుత్వాన్ని ఆదేశించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. నామమాత్రపు చర్యలతో వైద్యశాఖ సరిపెడుతోందని ఆరోపించారు. మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టేలా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్రమంత్రిని కోరారు. థర్డ్ వేవ్ వచ్చినా... రాకున్నా పిల్లల కోసం వైద్య సదుపాయాలు పెంచాలని బాధిత సంఘం అధ్యక్షుడు జగన్ కోరారు.
ఆస్పత్రులను సిద్ధం చేయాలి
రాష్ట్రంలో ప్రస్తుతం పిల్లల వైద్యం కోసం నిలోఫర్ ఆస్పత్రి మాత్రమే ఉందన్నారు. ఏ మారుమూల గ్రామంలో పిల్లలు అనారోగ్యం పాలైనా... హైదరాబాద్ వరకు రావాల్సి వస్తోందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అందుకే ప్రతి జిల్లా కేంద్రంలో పిల్లల వైద్యం కోసం వంద పడకల ఆస్పత్రులను సిద్ధం చేయడంతో పాటూ... పీహెచ్సీలో పిల్లల డాక్టర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి పేదలు బలవుతున్నారని... జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారికి ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: టీకాల పేరుతో నిర్మాత సురేశ్ బాబుకు టోకరా