ప్రగతి రిసార్ట్స్ ఓ అరుదైన రికార్డు నమోదు చేసింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ప్రగతి గ్రీన్ మెడోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధిపతి డాక్టర్ గడ్డిపాటి బాలకోటేశ్వరరావు (జీబీకే రావు) వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న సువిశాల రిసార్ట్స్ ప్రాంగణంలో పవిత్ర, మూలిక, ఔషధ మొక్కలు, వృక్ష జాతులు, పూల మొక్కలను 650 పైగా వినూత్న రీతిలో సంరక్షిస్తున్న తరుణంలో భారత్ నుంచి ఆ ఘనతను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేర్చింది.
25 ఏళ్ల నుంచి 40 లక్షల మొక్కలు, చెట్లు పెంచుతూ జీవవైవిధ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. గుంటూరు జిల్లా రేపల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన... మెకానికల్ ఇంజినీరింగ్ పట్టభద్రుడు. తన ప్రతిభతో విజయవంతమైన డిజైన్ ఇంజినీర్‌గా రాణించడమే కాకుండా పారిశ్రామికవేత్తగా ఎన్నో మైలురాళ్లు అధిగమించారు. 2500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రగతి జీవవైవిధ్య నాలెడ్జ్ పార్కు ఏర్పాటు చేశారు. భారతీయ రిషి సంస్కృతం, వేద జీవనానికి ప్రాణం పోశారు. ప్రపంచ మానవాళికి అత్యంత అవసరమైన వన మూలికలు, గోవులు ప్రాణ ప్రధాతలు అనే నినాదాలతో ముందుకు సాగుతూ విస్తృత ప్రచారం చేస్తున్నారు.
వివిధ రకాల మొక్కలు పెంచడం ద్వారా ఆకలి తీర్చడమే కాకుండా కాలుష్యం నివారించగలమని జీబీకే రావు తెలిపారు. నగర వనాలు, తోటలు అభివృద్ధి చేయడంలో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా చెడు బ్యాక్టీరియా, వైరస్‌లు, దోమలు లేని ప్రదేశాలను సృష్టించవచ్చని ఆయన అంటున్నారు. లండన్‌లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గుర్తింపు పొందిన డాక్టర్ జీబీకే రావును ఇంగ్లాండ్ పార్లమెంట్ సభ్యుడు వీరేంద్ర శర్మ, డబ్ల్యూబీఆర్ యూరప్ అధిపతి మిస్టర్ విల్హెల్మ్ జెజ్లర్, డబ్ల్యూబీఆర్ స్విట్జర్లాండ్ అధ్యక్షురాలు పూనమ్ జెజ్లర్, లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఛైర్మన్ డాక్టర్ దివాకర్ సుకుల్ అభినందించారు.
ఇదీ చదవండి: Raj and Dk: సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి.. స్టార్స్‌గా ఎదిగి