ఫిర్యాదులు, కేసులు, దర్యాప్తులు, అరెస్ట్‌లు పోలీసులకు కొత్తేం కాదు. కరడుగట్టిన నేరస్థులను సైతం పక్కావ్యూహంతో పట్టుకుని ఊచలు లెక్కించేలా చేస్తుంటారు. అంతర్రాష్ట్ర ముఠాలు, గొలుసు దొంగలు, సైబర్ మాయగాళ్లు ఎంతటివారైనా మహానగరంలో కాలుపెడితే నిఘానేత్రాలు ఇట్టే పసిగడుతుంటాయి. ఏ మాత్రం ఆనవాళ్లు చిక్కినా క్షణాల్లో పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. జాతీయ స్థాయిలోనే అంతటి గుర్తింపు ఉన్న పోలీసులు ఇప్పుడు అరెస్ట్‌లు అంటే.. అమ్మో! అనాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
హతవిధీ.. ఎలా చేసేది
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు కరోనా బారినపడుతున్నారు. ఇటీవల ఓ ఏఎస్సై దంపతులు చికిత్స పొందుతూ మరణించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వర్తిస్తున్నా ఏదో ఒక సమయంలో వైరస్‌కు గురవ్వాల్సి వస్తుందంటూ ఓ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. 4, 5 తరగతులు చదివే ఇద్దరు పిల్లలను వాళ్ల అమ్మమ్మ ఇంటికి పంపి విధులకు హాజరవుతున్నానంటూ తెలిపారు. రెండోదశ ఊహకు అందని విధంగా ప్రమాదకరంగా మారింది. పోలీసుల విధి నిర్వహణకు సవాల్ విసురుతోంది. పలు కేసుల్లో నిందితులు, పాత నేరస్థులను అదుపులోకి తీసుకుని విచారించటం, రిమాండ్‌కు తరలించే సమయంలో వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించటం తప్పనిసరి. ఆ సమయంలో నిందితుల్లో కొవిడ్‌కు గురైనవారు ఉండటంతో పోలీసులు జంకుతున్నారు.
ముందుచూపు మరిచారా!
మూడు పోలీసు కమిషనరేట్స్ పరిధిలోని ఠాణాలకు వేలాది ఫిర్యాదులు వస్తుంటాయి. గతేడాది కొవిడ్ కల్లోలంతో యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీస్‌స్టేషన్లలో పనిచేసే సిబ్బంది, ఫిర్యాదుదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనటంతో ఆంక్షలు అటకెక్కాయి. ప్రస్తుతం ఠాణాలకు వస్తున్న ఫిర్యాదుదారులు, కొద్దిమంది సిబ్బంది నిబంధనలు పాటించకపోవటం ప్రమాద తీవ్రతకు కారణమంటూ ఓ ఇన్‌స్పెక్టర్ ఆవేదన వెలిబుచ్చారు.
- ఇదీ చదవండి : ఆక్సిజన్ కొరతతో 20 మంది రోగులు మృతి