హైదరాబాద్‌లో నిర్మాణరంగ పనలు ప్రారంభమైన నేపథ్యంలో ఇక్కడే ఉండి పనిచేసుకోవాలని వలస కార్మికులకు నగర పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. సొంతూళ్లకు వెళ్తామంటూ పోలీస్ స్టేషన్ల వద్ద వందల సంఖ్యలో వలస కార్మికులు బారులు తీరుతుండడం వల్ల పరిస్థితి అదుపు తప్పుతోంది. దీంతో కూలీల వివరాల నమోదు కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. సంయుక్త కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి, ఉత్తర మండలం డీసీపీ కల్మేశ్వర్ శింగన్వార్ వెయ్యి మంది వలస కార్మికులకు భోజనం అందించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1.22 లక్షల మంది వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు పేర్లను నమోదు చేసుకున్నారని, వారిని దశలవారీగా పంపుతున్నామని తరుణ్ జోషి తెలిపారు. సైబరాబాద్ పరిధిలో లక్ష మంది కార్మికులు ఉండగా, పలుచోట్ల రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న వారిని గుర్తించి పునరావాసం కల్పిస్తున్నారు.