ప్రభుత్వాలు ఎంత చేస్తున్నా.. దారి చూపిన నగరంలో బతకలేమని సొంతూళ్లకు పయనమవుతున్నారు వలస కార్మికులు. కేంద్రం ప్రకటనతో తమ ప్రాంతాలకు వెళ్లేందుకు వలస కూలీలు సమీపంలోని రైల్వే స్టేషన్లకు తరలుతున్నారు. అక్కడి రక్షణ దళ సిబ్బంది, పోలీసులు వారికి నచ్చజెబుతూ వెనక్కి పంపిస్తున్నారు.
ముందస్తుగా చర్యలు...
సాధారణంగా ఊరెళ్లాలంటే వలస కార్మికులు అధిక శాతం సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లనే ఆశ్రయించేవారు. లాక్‌డౌన్‌లోనూ తమ రాష్ట్రాలకు పంపాలని నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లకు కూలీలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో అధికారులు ముందస్తుగా స్టేషన్ పరిసరాల్లోకి రాకుండా బారికేడ్లు పెడుతున్నారు.
నగర శివార్ల నుంచే దూర ప్రాంతాలకు రైళ్లు వెళ్తుండడం వల్ల వారంతా లింగంపల్లి, ఘట్‌కేసర్, చర్లపల్లికి తరలుతున్నారు. శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో నిర్మాణ పనుల్లో ఉన్న 2 వేల మంది సోమవారం రాత్రి లింగంపల్లి రైల్వే స్టేషన్ వైపు దూసుకు వెళ్తుండగా.. బహదూర్‌పురా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్తతకు దారితీసినా.. పోలీసులు అతికష్టం మీద వారిని వెనక్కి పంపారు.