స్వస్థలాలకు వెళ్లేందుకు వలస కార్మికులు పాసుల కోసం పోలీస్ స్టేషన్ల బాట పట్టారు . కూలీల వివరాలు నమోదు చేసుకొని, వారి ఫొటోలు తీసుకున్నారు పోలీసులు. ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు లక్ష మంది వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
- మాదాపూర్ పోలీసులు హైటెక్స్ ప్రాంగణంలోని మూడు హాళ్లలో 40 కౌంటర్లను ఏర్పాటు చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పరిశీలించి సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. వ్యక్తిగత దూరం పాటించేలా.. కూర్చున్న చోటుకే ఆహారపు పొట్లాలను అందజేసేలా ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 4600 మంది వివరాలను నమోదు చేశారు.
- గచ్చిబౌలి పోలీసులు సంధ్యా కన్వెన్షన్ సెంటర్‌లో శిబిరం ఏర్పాటు చేశారు. 2వేల మందికి పైగా వివరాలను నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్ ఆర్.శ్రీనివాస్ పేర్కొన్నారు.
- పంజాగుట్ట ఠాణా పరిధిలోని 7 సెక్టార్లలో 13 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి తెలిపారు. 2వేల మందికి పైగా నమోదు ప్రక్రియ పూర్తయిందని.. బుధవారం సాయంత్రం నాటికి పూర్తి చేస్తామన్నారు.
- గోల్కొండ ఠాణా పరిధిలో నిర్మాణ పనులు మొదలు కావడం వల్ల ఉండే వాళ్లు ఉండొచ్చంటూ ఇన్‌స్పెక్టర్ కె.చంద్రశేఖర్‌రెడ్డి వలస కూలీలకు సూచించారు. ఆహారపు పొట్లాలను అందజేశారు. 1300 మందికి పైగా వివరాలు నమోదు చేశామన్నారు.
- విశ్వనాథ్ గార్డెన్‌లో బిహార్, యూపీ తదితర రాష్ట్రాలకు చెందిన 3వేల మంది వివరాలు నమోదు చేసినట్లు మియాపూర్ సీఐ వెంకటేష్ తెలిపారు.
- నాచారం పీఎస్ పరిధి మల్లాపూర్‌లో వివరాల నమోదు ప్రక్రియను రాచకొండ క్రైమ్స్ డీసీపీ యాదగిరి పరిశీలించారు.
- మాదన్నపేట ఠాణాలో 478, సంతోష్‌నగర్‌లో 480, కాంచన్‌బాగ్‌లో 502, భవానినగర్‌లో 940 మంది కూలీల వివరాలు నమోదు చేసుకున్నట్లు సంతోష్‌నగర్ ఏసీపీ శివరామశర్మ తెలిపారు. రెయిన్‌బజార్‌లో 400, డబీర్‌పురాలో 500కు పైగా ఉన్నారు.
- ఫిలింనగర్‌లోని రామానాయుడు కళామండపంలో దాదాపు రెండు వేల మంది వలస కూలీల వివరాలను నమోదు చేశారు.
- టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, కర్ణాటక, జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన 1210 మంది కార్మికుల వివరాలు సేకరించారు.
- ముషీరాబాద్ డివిజన్‌లోని జీఎన్ గార్డెన్‌లో పోలీసులు శిబిరం ఏర్పాటు చేశారు.
- పేట్‌బషీరాబాద్ సీఐ మహేశ్ స్థానిక పీఎస్‌ఆర్ కన్వెన్షన్‌లో సుమారు 800 మంది వలస కార్మికులకు భోజన వసతి కల్పించారు. అనంతరం పాస్‌ల జారీ కోసం వారి పేర్లు నమోదు చేసుకున్నారు.
- గాంధీనగర్ ఠాణా పరిధిలోని వలస కూలీల వివరాలను సీఐ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో సిబ్బంది నమోదు చేసుకున్నారు.