Subrahmanyam Murder Case: ఆంధ్రప్రదేశ్ వైకాపా ఎమ్మెల్సీ అనంత్ ఉదయ్ భాస్కర్ మాజీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు.. ఆయన్ని అరెస్ట్ చేయడంపై మాత్రం తాత్సారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అరెస్ట్ చేస్తేనే పోస్ట్ మార్టమ్‌కు సహరిస్తామని కుటుంబ సభ్యులు తెగేసి చెప్పడంతో.. అజ్ఞాతంలో ఉన్న వారిని బలవంతంగా కాకినాడ జీజీహెచ్‌కు తరలించిన పోలీసులు.. పోస్ట్ మార్టమ్‌కు అనుమతించాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. అదే సమయంలో ఎస్సీ, తెదేపా, వామపక్ష, భాజపా పార్టీలు ఉద్ధృతంగా ఆందోళన చేయడంతో.. పోలీసుల్లో కదలిక వచ్చింది.
రెండు రోజులపాటు కనీస విచారణ జరపని పోలీసులు.. అన్ని వైపుల నుంచి విమర్శల జడివాన కురవడంతో చివరకు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేస్తామని సెక్షన్-302 కింద హత్య కేసుగా మారుస్తున్నట్టు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రకటించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటివరకు ఎమ్మెల్సీ ఆచూకీ కనిపెట్టలేదు. అనంత ఉదయ్ భాస్కర్ రంపచోడవరం మన్యం కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. ఎమ్మెల్యే ధనలక్ష్మితో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అలాగే కాకినాడలోనూ నివాసం ఉంటారు. ఆయన వద్ద ఇద్దరు గన్మెన్లు ఉన్నారు. అనుచరులు, మద్దతుదారులతో హడావుడి ఉంటుంది. డ్రైవర్ మృతి ఘటన తర్వాత తుని, పిఠాపురంలో వివాహాలకు హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన ఎక్కడ ఉన్నారన్నది తేలాల్సి ఉంది.
రాజమహేంద్రవరంలో వైకాపా నాయకుడి ఇంటి వద్ద శనివారం గడిపిన ఎమ్మెల్సీ.. ఆ తర్వాత మరో ప్రాంతంలోకి వెళ్లారని సమాచారం. కాకినాడ భానుగుడి జంక్షన్ సమీపంలోని శంకర్ టవర్స్ వద్ద అపార్ట్ మెంట్‌లో అనంత బాబు ఉన్నట్టు సమాచారం రావడంతో పోలీసులు అక్కడ పరిశీలించారు. అక్కడ ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఎమ్మెల్సీని ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్న అంశంపైనే అందరి దృష్టి నెలకొంది.
అంతిమ సంస్కారాలు పూర్తి: సుబ్రహ్మణ్యం అంతిమ సంస్కారాలు... ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడలో నిర్వహించారు. డ్రైవర్ మృతికి ఎమ్మెల్సీనే కారణమంటూ.. సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు శనివారం ఆందోళనకు దిగారు. ఉదయ్‌భాస్కర్‌ని అరెస్టు చేసే వరకూ శవపరీక్ష నిర్వహించడానికి వీల్లేదంటూ నిరసన చేపట్టారు. పలు దఫాల చర్చల అనంతరం శనివారం అర్థరాత్రి సుబ్రహ్మణ్యం మృతదేహానికి శవపరీక్ష నిర్వహించిన పోలీసులు.. ఆదివారం ఉదయం అతని స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడకు తరలించారు. మృతదేహానికి కులవివక్ష పోరాట సంఘాల నేతలు, స్థానికులు నివాళులు అర్పించారు. తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. డ్రైవర్ మృతికి అనంతబాబే కారణమన్న కులవివక్ష పోరాట సంఘాల నేతలు.. అతడ్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
పోస్టుమార్టం నివేదికలో ఏముంది? : శనివారం అర్ధరాత్రి 1.30 గంటలకు వైద్యులు పోస్టుమార్టం పూర్తిచేసి, నివేదికను పోలీసులకు ఇచ్చారు. తలపై రెండు గాయాలు, రెండు చేతులు విరిచిన ఆనవాళ్లు, ఒళ్లంతా తీవ్రంగా కవుకు గాయాలు, ఎడమ కాలు బొటనవేలు, కుడికాలు మడమ దగ్గర గాయాలు గుర్తించినట్లు తెలుస్తోంది. మర్మావయవం మీద కూడా గట్టిగా తన్నడంతో గాయాలైన ఆనవాళ్లు ఉన్నట్లు సమాచారం.
ఎమ్మెల్సీ అనంతబాబుపై గతం నుంచి నేరారోపణలు ఉన్నాయి. రంపచోడవరం పోలీసులు గతంలో రంగురాళ్ల కేసులో రౌడీషీట్ నమోదు చేశారు. మన్యంలో ఈయన చెప్పిందే వేదమని.. ఆయన చెప్పినట్లు ఎవరైనా వినకపోతే ఊరుకోరని అంటారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆయనపై ఉన్న రౌడీషీట్‌ను ఎత్తేశారు. మరికొన్ని ఇతర కేసులనూ ఆ తర్వాత ఉపసంహరించినట్లు సమాచారం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరిలో ఈయన ప్రముఖుడు. ఈ సాన్నిహిత్యంతోనే డీసీసీబీ ఛైర్మన్ పదవి వరించింది. సాంకేతికంగా ఆ పదవి కోల్పోవడంతో వెంటనే ఎమ్మెల్సీ పదవి దక్కడం.. పార్టీలో ఆయనకున్న పట్టుకు సంకేతం.
నల్లమిల్లి గృహ నిర్బంధం: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరు నిరంకుశంగా ఉందని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్ పూర్వ కారు డ్రైవరు సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ఆదివారం జి.మామిడాడ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు రామకృష్ణారెడ్డిని రామవరంలో గృహనిర్బంధం చేశారు. అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెదేపా ఇంఛార్జిగా ఉన్న తాను మృతదేహాన్ని సందర్శించి, నివాళి అర్పించాల్సిన బాధ్యత ఉన్నా ఉదయం నుంచి పోలీసులు గృహనిర్బంధం చేయడం బాధాకరమని రామకృష్ణారెడ్డి అన్నారు.
ఇవీ చూడండి