జైళ్లల్లో కరోనా వైరస్ కట్టడికి పోలీస్ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చోరీలు, దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు చేసిన వారిని జైలుకు పంపించకుండా ఇంట్లోనే ఖైదీగా ఉండమంటున్నారు. జైళ్లలో వైరస్ ప్రబలకుండా సామర్థ్యానికి మించి ఎక్కువమంది ఖైదీలను ఉంచొద్దంటూ సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ నెలాఖరు వరకు మార్గదర్శకాలను పాటించనున్నామని, తర్వాత న్యాయస్థానం నిర్ణయం ఆధారంగా చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. ఇందులో నిందితులు చేసిన నేరానికి ఏడేళ్లు, ఏడేళ్లలోపు శిక్ష ఖరారయ్యే అవకాశం ఉన్నవారికి మాత్రమే ఈ మినహాయింపు. చోరీలు, ఇళ్లల్లో దొంగతనాలు, సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు వారికి తాఖీదులు ఇచ్చి పంపుతున్నారు.
నిందితుల్లో కరోనా పాజిటివ్.. నేరాలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైళ్లకు పంపిస్తారు. అలా రాష్ట్రవ్యాప్తంగా ఏటా 14,500 మందిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వీరిలో 14 రోజుల్లోపు 90 శాతం మంది బెయిల్‌పై విడుదలవుతున్నారు. వరంగల్, చంచల్‌గూడ, చర్లపల్లి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ కేంద్ర కారాగారాల్లో గతేడాది కరోనా తొలిదశ వరకు పరిమితి కంటే ఎక్కువగా ఉండేవారు. కొత్తగా వచ్చే రిమాండ్ ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు చేయించేవారు. పాజిటివ్ ఉంటే ఆసుపత్రులకు తరలించేవారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో వారికి ప్రత్యేక బ్యారక్‌లు కేటాయిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ జైళ్లల్లో కరోనా వైరస్ విజృంభించడం, కొందరు న్యాయవాదులు.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దేశవ్యాప్తంగా అన్నిజైళ్లలో వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో హత్యలు, అత్యాచారాలు, అనిశా కేసుల్లో పట్టుబడిన అధికారులు, మానవ అక్రమ రవాణా చేస్తున్న నేరస్థులను మాత్రమే జైలుకు పంపుతున్నారు.
రెండు, మూడు రోజులకోసారి హాజరు..
నిందితులను జైలుకు పంపకపోయినా పోలీసులు వారి కదలికలను, ప్రవర్తనను పరిశీలిస్తున్నారు. సీఆర్‌పీసీ తాఖీదు తీసుకున్న అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని, రోజూ రాత్రి వేళల్లో గస్తీ బృందాలు ఇంటికి వచ్చినప్పుడు వారిని కలిసి తాను పారిపోలేందంటూ రుజువు చేసుకోవాలని ఆదేశిస్తున్నారు. రెండు, మూడు రోజులకోసారి ఠాణాకు రావాలని, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండాలని చెబుతున్నారు. అత్యవసర పనులకు ఇతర జిల్లాలకు వెళ్లినప్పుడు సమాచారం ఇవ్వాలంటూ వివరిస్తున్నారు. సైబర్, ఆర్థిక నేరస్థులకు తాఖీదులు ఇచ్చినా.. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు పారిపోయే అవకాశాలున్నాయన్న అంచనాతో అన్ని విమానాశ్రయాలకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తున్నారు. మెట్రో నగరాల పోలీసులకు వారి వివరాలు పంపుతున్నారు.
ఇదీ చూడండి: KYC: కేవైసీతో సైబర్ నేరస్థుల కొత్త ఎత్తుగడ