ఏపీలో అమరావతి రాజధాని కోసం రైతులు, మహిళలు చేస్తున్న మహా పాదయాత్రలో పోలీసులు భారీగా మోహరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ.. పాదయాత్ర నిర్వాహకులకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.
పర్చూరులోని రైతుల శిబిరం వద్దకు వెళ్లిన డీఎస్పీ శ్రీకాంత్.. పరిస్థిని సమీక్షించారు. అయితే.. హైకోర్టు ఆదేశాల మేరకే యాత్ర సాగుతుందని ఐకాస నాయకులు తెలిపారు. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించడం లేదని, అయితే.. ఎవరైనా వచ్చి తమకు సంఘీభావం తెలిపితే, తమకు సంబంధం లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు.
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు
ఏపీలో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు నిర్ణయాలకు వ్యతిరేకంగా 685 రోజులు... వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేసిన రైతులు, మహిళలు మహా పాదయాత్ర ద్వారా తమ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేశారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు తలపెట్టిన మహా పాదయాత్రను తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి నవంబర్ 1న ఉదయం 9గంటల 5 నిమిషాలకు ప్రారంభించారు.
వివిధ పార్టీల నేతల మద్దతు...
అమరావతి ప్రజల ఆకాంక్షకు వివిధ పార్టీల నేతలు మద్దతు పలికారు. రైతులు, మహిళలతో కలిసి పాదయాత్ర(Amaravathi maha Padayatra)లో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున సీనియర్ నేతలు దేవినేని ఉమా, పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరావతి ఏకైక రాజధాని కొనసాగేవరకు తమ మద్దతు సాగుతుందని నేతలు తెలిపారు. అమరావతి రైతుల మహా పాదయాత్ర(Amaravathi maha Padayatra) గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా సాగనుంది. తొలిరోజు గుంటూరు జిల్లా తుళ్లూరు నుంచి పెదపరిమి మీదుగా తాడికొండ వరకు 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. రోజుకి 10 నుంచి 15 కిలోమీటర్ల మేర అమరావతి రైతులు నడవనున్నారు.
ఇదీ చూడండి: Amaravati Padayatra: మహా సంకల్పం... అమరావతి రైతుల 'మహా పాదయాత్ర' ప్రారంభం