Young Man Absconded With Rs 7 Crore Worth Of Diamonds: హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ పీఎస్ పరిధిలోని రూ.7కోట్లు బంగారం, వజ్రాభరణాలతో పరారైన నిందితుడి గురించి ఎస్సార్ నగర్పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఐదు బృందాలుగా విడిపోయి.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. సీసీ కెమెరా పుటేజిలను పరిశీలించడంతో పాటు.. కారు జాడను కనుక్కునే పనిలో పడ్డారు.
మాదాపూర్‌లో నివాసం ఉండే రాధిక.. నగల దుకాణదారులతో ఒప్పందం కుదుర్చుకుని బంగారం, వజ్రాభరణాలను వాట్సాప్ ద్వారా మార్కెటింగ్ చేస్తుంది. వినియోగదారులకు నచ్చితే నేరుగా.. వారి ఇంటివద్దకే డెలివరీ చేస్తారు. ఈ క్రమంలో అనూష అనే మహిళ.. ఆమె వద్ద రూ.50లక్షలు విలువ చేసే వజ్రాభరణాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో బంజారాహిల్స్‌లో ఉండే సిరిగిరి రాజు జువెల్లర్స్ నుంచి రూ.7కోట్లు విలువ చేసే వజ్రాభరణాలను తీసుకురమ్మని రాధిక డ్రైవర్ శ్రీనివాస్‌కు చెప్పింది. కోట్లలో ఆభరణాలు కళ్లముందు కనబడటంతో.. శ్రీనివాస్‌లో ఆశపుట్టింది. అదును కోసం చూస్తూ.. తగిన ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.
సిరిగిరి రాజు జువెల్లర్స్ నుంచి నగలు తీసుకున్న తరువాత మార్గమధ్యలోనే రూ.50లక్షలు ఖరీదు చేసే ఆభరణాన్ని కస్టమర్ అనూషకు ఇవ్వాలని డ్రైవర్ శ్రీనివాస్, సేల్స్ మెన్ అక్షయ్‌ను.. రాధిక సూచించింది. ఈ మేరకు వారు మధురానగర్‌కు వెళ్లారు. సేల్స్ మెన్ లోపలికి వెళ్లి వచ్చేసరికి.. బయట కారు లేదు. వెంటనే రాధికకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. రాధిక సూచన మేరకు వెంటనే సేల్స్ మెన్ ఎస్సార్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
శ్రీనివాస్ రెండు నెలల క్రితం రాధిక దగ్గర డ్రైవర్‌గా చేరినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రైవేట్ వసతిగృహంలో ఉంటూ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ అసలు చిరునామా తెలుసుకున్న ఎస్సార్ పోలీసులు అక్కడికి వెళ్లి తల్లిదండ్రులను కలిశారు. శ్రీనివాస్‌పై గతంలోనూ నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇవీ చదవండి: